అంబేద్కర్‌ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ | Minister Merugu Nagarjuna Comments On Ambedkar Statue | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ

Published Wed, Jan 17 2024 11:40 AM | Last Updated on Wed, Jan 17 2024 3:17 PM

Minister Merugu Nagarjuna Comments On Ambedkar Statue - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్‌ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్‌ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్‌ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు.

‘‘అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్‌ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన: మంత్రి ఆదిమూలపు
పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన,అణగారిన,దళిత వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. చిట్టచివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అవినీతి లేని పాలన.. పారదర్శకత.. జవాబుదారీ తనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు. నేను ఉన్నాను...నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్‌ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు.

ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తెలుగు భాషను చంపేస్తున్నారని నానా యాగీ చేశారు. సీఎం జగన్‌ ధైర్యంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఈ రోజు మావంటి వారు క్యాబినెట్‌లో ఉన్నారంటే సీఎం జగనే కారణమని మంత్రి అన్నారు.

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర: మల్లాది విష్ణు
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్‌ ఆలోచన అభినందనీయమని.. భారతదేశంలో  ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమని విష్ణు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement