సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు.
అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి
అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది.
►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం
► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది.
► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు.
► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు.
► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది.
Comments
Please login to add a commentAdd a comment