పనులను పరిశీలిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, గంజి చిరంజీవి తదితరులు
మంగళగిరి/తాడేపల్లి రూరల్: గడిచిన రెండు దఫాలుగా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ ఓటమి తథ్యమన్నారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత) చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకంగా చెప్పారు.
మంగళగిరిలో మిద్దే సెంటర్‌లో నిర్వహించే సామాజిక సాధికార యాత్ర మహాసభకు ముందు పెద్దఎత్తున పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొనాలని, మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో కాంగ్రెస్ చనిపోయింది
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడో చనిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడగొట్టి, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాబోయే తరాలకు సైతం ఆ పార్టీ తీరని ద్రోహం చేసిందన్నారు. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని అన్నారు. ఈ బస్సుయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకుడు రాపాక శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు.
24 గంటల్లో సమస్య పరిష్కారం
విజయసాయిరెడ్డి చొరవతో తెనాలి–మంగళగిరి రహదారికి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. విజయసాయిరెడ్డి సోమవారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న తెనాలి–మంగళగిరి రహదారి విషయాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయంలో విజయసాయిరెడ్డి చొరవ తీసుకోవడంతో అధికారులు 24 గంటల్లోనే రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఐదారు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment