సాక్షి, విజయవాడ: జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపులేని పార్టీ.. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
‘‘కోనేరు సురేష్ అనే వ్యక్తి పదిలక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓస్ చెప్పాలి, గాని ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు?. ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోమన్నాం. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేశాం’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘‘తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారు. ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరాం. తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటరగా నమోదు చేసుకోవాలి. యువగళం, చంద్రబాబు సభలో అసభ్యపదజాలంతో సీఎం జగన్‌ను విమర్శించారు. లోకేష్ ఎర్రబుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడు. అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నా వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అంటూ లోకేష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరాం. రెండు రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరపాలని కోరాం . ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చు . చంద్రబాబు జీవితమే మోసపూరితం.. కుట్రలతో నిండిపోయింది’’ అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు
1). ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదుల చేసిన కోనేరు సురేష్ అనే వ్యక్తిపై చర్య తీసుకోవాలి
- టీడీపీ తరఫున ఎన్నికల్లో అక్రమాలకు కుట్ర చేసిన కోనేరు సురేష్.
- అధికారులపై నిరాధార ఆరోపణలు. నిందలు.
- 10 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటూ తప్పుడు ఫిర్యాదు.
- ఆ ఫిర్యాదును జిల్లాల్లో పరిశీలనకు పంపిన ఎలక్షన్ కమిషన్.
- కర్నూలు జిల్లాలో 67,370 చెల్లని ఓట్లు ఉన్నాయని సురేష్ ఫిర్యాదు.
- ఓటర్ల జాబితాలు పరిశీలించిన కర్నూలు కలెక్టర్. క్షేత్రస్థాయిలో లోతుగా అధ్యయనం. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన జిల్లా అధికారులు.
- సురేష్ ఫిర్యాదు చేసిన చెల్లని ఓట్లలో.. 59,000 వేల ఓట్లు వాస్తవ ఓట్లే అని తేల్చిన అధికారులు.
- బతికి ఉన్నవారూ చనిపోయినట్లు ఫిర్యాదు చేసిన కోనేరు సురేష్. తప్పుడు సమాచారంతో అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం.
- మొత్తంగా 80 శాతం ఓట్లు వాస్తవ ఓట్లేనని నిర్ధారణ.
- తెలుగుదేశం పార్టీ తరపున సురేష్ చేసిన తప్పుడు ఫిర్యాదు వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం వాటిల్లిందని వెల్లడి.
- అలాగే అన్నమయ్య, విశాఖ జిల్లాల నుంచి కూడా ఎన్నికల సంఘానికి (ఈసీ) వాస్తవ నివేదికలు.
- వెంటనే టీడీపీపైనా, కోనేరు సురేష్‌పైనా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్.
- జాబితాలో ఒక్క ఓటు తొలగించాలన్నా.. లేదా చేర్చాలన్నా బూత్ లెవల్ ఆఫీసర్ వద్దే, క్షేత్రస్థాయిలో జరగాలి.
- నియమ, నిబంధనల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా, నిరాధార ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ. కోనేరు సురేష్.
- ఏకంగా 10 లక్షల ఓట్లు బోగస్ అని, వాటిని తొలగించాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. దాన్ని ఎలా పరిగణలోకి తీసుకున్నారు? అన్న అంశాన్ని ఈసీ ప్రతినిధుల వద్ద ప్రస్తావించిన వైయస్సార్‌సీపీ.
- అసలు ఆ 10 లక్షల ఓట్లకు సంబంధించిన డేటా కోనేరు సురేష్‌కు ఎలా లభించిందన్న దానిపైనా దర్యాప్తు చేయాలన్న వైఎస్సార్‌సీపీ నేతలు
2). అక్రమంగా ఓటర్ల వివరాల ప్రొఫైలింగ్
- మై పార్టీ డాస్‌బోర్డ్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటర్ల వివరాలను ప్రొఫైల్ చేశారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.
- రాష్ట్రంలోని 4 కోట్ల మంది ఓటర్లను వారు (టీడీపీ నాయకులు) ప్రొఫైల్ చేస్తున్నారు.
- ఇంకా ఆ డేటాను అమెరికాలోని అమెజాన్ సర్వర్‌లో స్టోర్ చేశారు.
- భవిష్యత్తులో ఒకవేళ ఆ డేటా బ్రీచ్ అయితే బాధ్యులు ఎవరు?.
- నిజానికి ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఓటర్లను ప్రొఫైల్ చేయకూడదు. కులం, మతం, పొలిటికల్ ప్రిఫరెన్స్ ప్రాతిపదికన ఓటర్ల ప్రొఫైలింగ్ చట్ట విరుద్ధం.
- కానీ ఆ పని చేసిన తెలుగుదేశం పార్టీ.. ఆ ప్రొఫైల్ ఆధారంగా ఓటర్ల తొలగింపునకు ప్రయత్నించింది.
- అందువల్ల దీనిపై చర్యలు తీసుకోవాలి.
3). వెబ్ లింక్ క్రియేషన్.
- ఇంకా టీడీపీ మేనిఫెస్టో అనే మరో వెబ్‌లింక్‌ను క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ.
- డోర్ టు డోర్ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటున్నారు.
- ఓటర్ల ఫోన్లకు ఓటీపీలు వస్తున్నాయి. ఆ ఓటీపీని వారు సేకరిస్తున్నారు.
- అలా సేకరించిన డేటాను కూడా లండన్‌లో ఉన్న సర్వర్‌లో స్టోర్ చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం.
- దీనిపైనా తగిన చర్య తీసుకోవాలి.
4). ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి
- ప్రజా ప్రాతినిథ్య చట్టం, సెక్షన్ 17, 18 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి.
- కానీ తెలంగాణలో ఇటీవల ఓటు వినియోగించుకున్న వారు.. తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చేరిక కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఉదా:
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు కోసం మంగళగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు.
అలా ఏపీలో ఓట్ల కోసం అక్కడ (తెలంగాణలో) బ్యానర్లు కట్టి మరీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అక్రమ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలి.
5). రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరింపు
- రాష్ట్రంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్, ప్రతి చోటా రెడ్ బుక్ చూపి, అందులో చాలా మంది అధికారుల పేర్లు నమోదు చేశానంటూ బెదిరిస్తున్నారు.
- ఆ విధంగా అధికారులను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేయాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.
- అలా అధికారులను తమ వైపు తిప్పుకోవాలన్నది నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ కుట్రలా కనిపిస్తోంది.
- అందువల్ల ఈ వ్యవహారంపైనా ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, తగిన చర్య తీసుకోవాలి.
ఇదీ చదవండి: మా వల్ల కాదు బాబూ..
Comments
Please login to add a commentAdd a comment