సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విగ్రహంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం టీడీపీ నేతలకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.
కాగా, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్,షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.
👉ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేయాలని చూశారు. ఈ దుశ్చర్యను యావత్ రాష్ట్ర ప్రజానీకం ఖండించారు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాం. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నిరసన తెలిపాం. కొంతమంది కళ్లు లేని కబోథులు అక్షరాలే కదా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అవాంతరం జరిగినా అవమానమే. గునపాలతో దాడి చేసేందుకు వస్తే మీకు కళ్లు కనిపించలేదా?. అంబేద్కర్ విగ్రహం బెజవాడ నడిబొడ్డున ఉండటం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాం. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. అంబేద్కర్ విగ్రహంపై గునపం పడితే ఊరుకునేది లేదు. మా ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎలాంటి వారైనా శిక్ష పడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
👉మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఉండటాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. రాత్రి పూట లైట్లు ఆర్పి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సెక్యూరిటీ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై కేంద్రాన్ని, గవర్నర్, రాష్ట్రపతిని, కోర్టులను ఆశ్రయిస్తాం.
👉వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నీచమైన చర్యలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
👉విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
👉వైఎస్సార్‌సీపీ నాయకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా పరిగణిస్తాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం ఖండించి ఉండేది. ఈవీఎంలను నమ్ముకున్నారు కాబట్టే అంబేద్కర్‌పై జరిగిన దాడిని ఖండించ లేకపోతున్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఎందుకు నివాళులర్పించలేదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంబేద్కర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు చైనా కంపెనీలకు, సుజనా చౌదరికి అమ్మేయాలని చూశారు. వారసత్వ సంపదైన స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూశారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం కాపాడారు. కుట్రలు కుయుక్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేదే కూటమి పార్టీల ఉద్ధేశం. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తిరస్కరిస్తారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment