సాక్షి, సిటీబ్యూరో: ‘హరిత, పారిశ్రామిక విప్లం పూర్తి చేసుకొని సాంకేతిక, సమాచారం విప్లవంలో ఉన్నాం. ప్రస్తుతం అంతర్జాలంలోకి ఎక్కి తెలుగును విశ్వభాషగా రూపొందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది’ అన్నారు రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ‘ఢిల్లీ తెలుగు అకాడమీ, రావడ ఫౌండేషన్ హైదరాబాద్’ సౌజన్యంతో ‘డీటీఏ అండ్ రావడ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు’ ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో జరిగింది.
సంగీత సుధానిధి డి.వి.మోహన్‌కృష్ణ, ప్రముఖ సాహితీవేత్త పోతుకూచి సాంబశివరావు, ప్రజా వాగ్గేయకారుడు జయరాజులకు మంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థి ఎన్.శశిధర్ తల్లి సుజాత, ఇంజినీరింగ్ విద్యార్ధి ఎ.సాయిశ్రీనివాస్, ఐదో తరగతి విద్యార్థి సాయికిరణ్‌లకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించారు. అదరహో: కార్యక్రమంలో కల్యాణి మ్యూజిక్ అకాడమీ 100 మంది విద్యార్థులతో నిర్వహించిన ‘శతవాద్య సంగీత విభావరి’ కళాభిమానులను పరవశులను చేసింది.
రవళి, రవితేజలు 15 నిముషాల్లో నర్తించిన 6 భారతీయ సంప్రదాయ నృత్యాలు అబ్బురపరిచాయి. యూనిక్ వరల్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్ మాట్లాడుతూ... శతవాద్య సంగీత విభావరిని, నృత్యభారతిని ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘనతలను ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా పంపుతామన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు, డాక్టర్ గోపాలకృష్ణ, ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్.నాగరాజు పాల్గొన్నారు.
విశ్వభాషగా తెలుగు
Published Sun, Sep 15 2013 2:43 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement