Democratic presidential nominee
-
ట్రంప్‌పై హిల్లరీదే ఆధిపత్యం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ హవా కొనసాగుతోంది. తాజా పోల్‌లోనూ ఆమె తన ప్రధాన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఐదుశాతం ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నట్టు తేలింది. వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోల్‌లో హిల్లరీకి 46శాతం ఓట్లు దక్కగా, రియల్ ఎస్టేట్ టైకూన్ ట్రంప్‌కు 41శాతం ఓట్లు, లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి గ్యారీ జాన్సన్‌కు 9శాతం ఓట్లు, గ్రీన్ పార్టీ అభ్యర్థి జీన్ స్టెయిన్‌కు రెండు శాతం ఓట్లు లభించాయి. రిజిస్టర్డ్ ఓటర్ల విషయంలో హిల్లరీ, ట్రంప్ మధ్య తేడా ఇంకా పెద్దస్థాయిలో ఉందని పోల్ స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ ఓటర్లలో 45శాతం మంది హిల్లరీకి జై కొట్టగా, కేవలం 35శాతం మందే ట్రంప్‌కు మద్దతు పలికారు. తాజా అభిప్రాయ సేకరణలను బట్టి నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అంత సులభం కాదనే విషయం స్పష్టమవుతున్నదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, చాలా రాష్ట్రాల్లో హిల్లరీ- ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్నదని, పలు రాష్ట్రాల్లో వీరిద్దరి మధ్య ఓట్లశాతంలో తేడా చాలా స్వల్పంగా ఉందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. ఇక హిల్లరీ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 9/11 ట్విన్ టవర్ పేలుళ్లలో చనిపోయినవారి సంస్మరణార్థం నిర్వహించిన కార్యక్రమంలో హిల్లరీ అస్వస్థతకు గురికావడంతో ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం హిల్లరీ న్యూయార్క్ లోని తన కూతురు నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. -
హిల్లరీ డాక్యుమెంట్లు ఇవ్వాలంటే 75 ఏళ్లు పడుతుందట!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ దేశ విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు అమె సహచరులు, సలహాదారుతో జరిపిన ఈ మెయిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి ఇవ్వడానికి 75 ఏళ్లు పడుతుందని, ఆ పాటికి కొన్ని తరాలే గడిచిపోతాయని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. విదేశాంగ మంత్రి హిల్లరి తన సహచరులు, సలహాదారులతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, ముఖ్యంగా ప్రైవేటు ఖాతా ద్వారా నెరపిన ఈ మెయిళ్ల డాక్యుమెంట్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ నేషనల్ కమిటీ గత మార్చి నెలలో కోర్టు కెక్కింది. దీనిపై కొలంబియా జిల్లా కోర్టు బుధవారం విచారణ జరిపింది. 75 ఏళ్లు పడుతుందని తాము కోర్టు ముందు ఆశామాషీగా చెప్పడం లేదని, రోజువారిగా ఏళ్ల తరబడి హిల్లరీ నెరపిన ఈ మెయిళ్ల తాలూకు డాక్యుమెంట్లు కోటాను కోట్ల పేజీలు అవుతాయని, వాటిన్నింటిని సేకరించి ఇవ్వడం మామూలు విషయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మీడియాకు తెలిపారు. తమ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుందని కూడా ఆయన తెలిపారు. హిల్లరీ తన ప్రైవేటు ఖాతా ద్వారా ఈ మెయిళ్లు పంపిన వారిలో మాజీ త్రివిధ దళాల అధిపతి చెరిల్ మిల్స్, సలహాదారు జాకబ్ సులివాన్, ఐటి నిపుణులు బ్య్రాన్ పగ్లియానోలు కూడా ఉన్నారు. అధికారిక ఈ మెయిల్ సౌకర్యం ఉన్నప్పుడు హిల్లరీ ఎందుకు ఎక్కువగా ప్రైవేటు ఈ మెయిల్ ఖాతా వాడారన్నది కూడా కోర్టు ముందు వాదనకు వచ్చింది. హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆమెపై దాఖలైన పలు కేసుల్లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ దాఖలు చేసిన కేసు ఇదొకటి.