వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ దేశ విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు అమె సహచరులు, సలహాదారుతో జరిపిన ఈ మెయిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి ఇవ్వడానికి 75 ఏళ్లు పడుతుందని, ఆ పాటికి కొన్ని తరాలే గడిచిపోతాయని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. విదేశాంగ మంత్రి హిల్లరి తన సహచరులు, సలహాదారులతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, ముఖ్యంగా ప్రైవేటు ఖాతా ద్వారా నెరపిన ఈ మెయిళ్ల డాక్యుమెంట్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ నేషనల్ కమిటీ గత మార్చి నెలలో కోర్టు కెక్కింది.
దీనిపై కొలంబియా జిల్లా కోర్టు బుధవారం విచారణ జరిపింది. 75 ఏళ్లు పడుతుందని తాము కోర్టు ముందు ఆశామాషీగా చెప్పడం లేదని, రోజువారిగా ఏళ్ల తరబడి హిల్లరీ నెరపిన ఈ మెయిళ్ల తాలూకు డాక్యుమెంట్లు కోటాను కోట్ల పేజీలు అవుతాయని, వాటిన్నింటిని సేకరించి ఇవ్వడం మామూలు విషయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మీడియాకు తెలిపారు. తమ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుందని కూడా ఆయన తెలిపారు.
హిల్లరీ తన ప్రైవేటు ఖాతా ద్వారా ఈ మెయిళ్లు పంపిన వారిలో మాజీ త్రివిధ దళాల అధిపతి చెరిల్ మిల్స్, సలహాదారు జాకబ్ సులివాన్, ఐటి నిపుణులు బ్య్రాన్ పగ్లియానోలు కూడా ఉన్నారు. అధికారిక ఈ మెయిల్ సౌకర్యం ఉన్నప్పుడు హిల్లరీ ఎందుకు ఎక్కువగా ప్రైవేటు ఈ మెయిల్ ఖాతా వాడారన్నది కూడా కోర్టు ముందు వాదనకు వచ్చింది. హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆమెపై దాఖలైన పలు కేసుల్లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ దాఖలు చేసిన కేసు ఇదొకటి.
హిల్లరీ డాక్యుమెంట్లు ఇవ్వాలంటే 75 ఏళ్లు పడుతుందట!
Published Thu, Jun 9 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement