ట్రంప్ పట్ల అసంతృప్తిగా ఉన్న సొంతపార్టీ ఓటర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వంపై సొంతపార్టీ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన గాలప్ పోల్ సర్వేలో 52 శాతం రిపబ్లికన్ పార్టీ ఓటర్లు ట్రంప్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. రిపబ్లికన్ ఓటర్లలో 42 శాతం మంది మాత్రం ట్రంప్ అభ్యర్థిత్వంపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలిందని మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది.
అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ ఓటర్లు 56 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. 46 శాతం మంది డెమోక్రాట్లు మాత్రం హిల్లరీ బదులుగా వేరే వాళ్లు ప్రెసిడెంట్ అభ్యర్థి అయితే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే యువ ఓటర్లలో హిల్లరీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలో తేలింది. 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ డెమోక్రటిక్ ఓటర్లలో 38 శాతం మాత్రమే హిల్లరీ అభ్యర్థిత్వంపై సంతృప్తిగా ఉన్నారు. 40 ఏళ్లకు పైబడిన వారిలో మాత్రం 67 శాతం మంది హిల్లరీ పట్ల సంతృప్తిగా ఉన్నారు. యువ డెమోక్రాటిక్ ఓటర్లు బెర్నీ సాండర్స్ తమ డెమోక్రటిక్ అభ్యర్థి అయితే బాగుండేదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.