Denesh Ramdin
-
రామ్‌దిన్ కు షాక్
బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెటరన్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేశ్ రామ్‌దిన్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ) షాక్ ఇచ్చింది. టెస్టు జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. భారత్ తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసిన విండీస్ టీమ్ లో అతడికి చోటు దక్కలేదు. అతడి స్థానంలో షేన్ డౌరిచ్ ను తీసుకున్నారు. తనను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్ ముందుగా సమాచారం ఇచ్చారని గతవారం రామ్‌దిన్ వెల్లడించాడు. తన ఉద్వాసను బ్రౌన్ కారణమంటూ మండిపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్, జెరోమ్ టేలర్ లను కూడా పక్కనపెట్టారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రొస్టన్ ఛేజ్ తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఎడంచేతి బ్యాట్స్ మన్ లియన్ జాన్సన్ కూడా జట్టులోకి వచ్చాడు. విండీస్ టెస్ట్ టీమ్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్(వైస్ కెప్టెన్), దేవేంద్ర బిషో, బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావొ, రాజేంద్ర చంద్రిక, రొస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, లియన్ జాన్సన్, మార్లన్ శామ్యూల్స్, షనన్ గాబ్రియల్ -
విండీస్ బోర్డుపై రామ్‌దిన్ ధ్వజం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ)పై వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేష్ రామ్‌దిన్ ధ్వజమెత్తాడు. భారత్‌తో జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం రామ్ దిన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. తన ఎంపికకు సంబంధించి యావరేజ్ సరిగా లేదని చెప్పిన విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్పై మండిపడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సిరీస్ లో వరుస రెండు ఇన్నింగ్స్‌లలో నమోదు చేసిన రెండు హాఫ్ సెంచరీలను రామ్ దిన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తాను చివరిగా ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో 59, 62 పరుగులు బ్రౌన్కు సరిపోలేదా?అని ప్రశ్నించాడు. టీమిండియాతో సిరీస్‌కు ఎంపిక కాలేదన్న విషయం తన అభిమానులకు తెలియాల్సిన అవసరం ఉందంటూనే విండీస్ బోర్డును ట్విట్టర్లో తప్పుబట్టాడు. ప్రత్యేకంగా తాను ఎంపిక కాలేకపోవడానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ బ్రౌన్ ప్రధాన కారణమని విమర్శించాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా ద్విశతకం సాధించకపోతే విండీస్ జట్టులో స్థానం కోల్పోక తప్పదేమో అంటూ చమత్కరించాడు. ఒక్క అంతర్జాతీయ సెంచరీ లేని ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని రామ్ దిన్ వేలెత్తి చూపాడు. రామ్ దిన్ టెస్టు కెరీర్లో ఇప్పటివరకూ 74 మ్యాచ్‌లు ఆడగా, అందులో నాలుగు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 13 మ్యాచ్‌లకు రామ్ దిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
శామ్యూల్స్ సెంచరీ వృధా
బ్రిడ్జిటౌన్: ముక్కోణపు సిరీస్ లో ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. 8వ వన్డేలో వెస్టిండీస్ ను 6 వికెట్లతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(78), మార్ష్(79) అర్ధసెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. 283 పరుగుల టార్గెట్ ను కంగారూ టీమ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మ్యాక్స్ వెల్ 46, బైయిలీ 34 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్ ను మార్లన్ శామ్యూల్స్, దినేశ్ రామదిన్ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 192 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. శామ్యూల్స్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. రామదిన్(91) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. మిగతా బ్యాట్ప్ మెన్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, ఫాల్కనర్ 2, బొలాండ్ 2 వికెట్లు పడగొట్టారు. సెంచరీ చేసిన శామ్యూల్స్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. -
రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు
బాస్సెటెరీ: బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో విండీస్ 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో రికార్డు భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. మూడో వికెట్ కు వీరిద్దరు 258 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో విండీస్ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అత్యుత్తమ భాగస్వామాల్లో ఇది ఐదో అతి పెద్దది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. బ్రేవో(124), రామ్‌దిన్(169) సెంచరీలతో చెలరేగారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ సిరీస్ రెండూ రామ్‌దిన్ దక్కించుకున్నాడు. -
డారెన్ స్యామీపై వేటుకు రంగం సిద్ధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ స్యామీపై వేటు వేసేందుకు రంగం సిద్దమయింది. టెస్టు కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించనున్నారు. అతడి స్థానంలో వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరిస్‌కు విండీస్ టెస్టు కెప్టెన్‌గా రామ్‌దిన్‌ను నియమించనున్నారని 'ట్రినిడాడ్ గార్డియన్' వెల్లడించింది. రామ్‌దిన్ నియామకానికి కరేబియన్ సెలెక్టర్లు ఆమోదం తెలిపారని పేర్కొంది. కెప్టెన్సీ చేపట్టడానికి రామ్‌దిన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డారెన్ స్యామీ ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడుతున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2010లో వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ నియమితుడయ్యాడు. 2013లో వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించి ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోకు అప్పగించారు.