విండీస్ బోర్డుపై రామ్దిన్ ధ్వజం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ)పై వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేష్ రామ్దిన్ ధ్వజమెత్తాడు. భారత్తో జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్కు తనను ఎంపిక చేయకపోవడం రామ్ దిన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. తన ఎంపికకు సంబంధించి యావరేజ్ సరిగా లేదని చెప్పిన విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్పై మండిపడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సిరీస్ లో వరుస రెండు ఇన్నింగ్స్లలో నమోదు చేసిన రెండు హాఫ్ సెంచరీలను రామ్ దిన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
తాను చివరిగా ఆడిన రెండు ఇన్నింగ్స్లలో 59, 62 పరుగులు బ్రౌన్కు సరిపోలేదా?అని ప్రశ్నించాడు. టీమిండియాతో సిరీస్కు ఎంపిక కాలేదన్న విషయం తన అభిమానులకు తెలియాల్సిన అవసరం ఉందంటూనే విండీస్ బోర్డును ట్విట్టర్లో తప్పుబట్టాడు. ప్రత్యేకంగా తాను ఎంపిక కాలేకపోవడానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ బ్రౌన్ ప్రధాన కారణమని విమర్శించాడు. ఏ బ్యాట్స్మెన్ అయినా ద్విశతకం సాధించకపోతే విండీస్ జట్టులో స్థానం కోల్పోక తప్పదేమో అంటూ చమత్కరించాడు. ఒక్క అంతర్జాతీయ సెంచరీ లేని ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని రామ్ దిన్ వేలెత్తి చూపాడు.
రామ్ దిన్ టెస్టు కెరీర్లో ఇప్పటివరకూ 74 మ్యాచ్లు ఆడగా, అందులో నాలుగు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 13 మ్యాచ్లకు రామ్ దిన్ కెప్టెన్గా వ్యవహరించాడు.