ఇదేమి 'గుడ్డు' రాజకీయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న దళిత పిల్లల నోటికాడి 'గుడ్డు'ను లాగేసుకున్నాయి హిందూత్వ రాజకీయాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలోకెల్లా ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే 52 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలు దళితులే. వారిని మాంసాహారమా, శాకాహారమా ? అన్న వాదనతో సంబంధం లేదు. స్వతహాగా శాకాహారి, హిందుత్వ పార్టీకి చెందిన ముఖ్యమంత్రయిన శివరాజ్ సింగ్ చౌహాన్ పిల్లలు 'కోడి గుడ్డు' స్కీమ్‌ను అమలు చేసేందుకు ససేమిరా అంగీకరించడం లేదు.
రాష్ట్రంలోని మూడు గిరిజన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద ఎన్నో పోషక విలువలుగల గుడ్డును ఆహారంలో సరఫరా చేద్దామంటూ తన ప్రభుత్వంలోని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. అంతేకాకుండా తన నిర్ణయాన్ని ప్రజల ముందు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఎవరి విశ్వాసాలు వారికుంటాయి సరే, తాను శాకాహారి అయినంత మాత్రాన...ఇతరులంతా శాకాహారులుగా మారాలన్న రూలేమి లేదుకదా? బలవంతంగా రుద్దే ఇలాంటి రూలు ఏ ప్రజాస్వామిక విలువలకు పట్టం కడుతోందో విజ్ఞులు ఆలోచించలేరా? ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాకుండా నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో గుడ్డు స్కీమ్‌ను అమలు చేయడం లేదు.
నేడు దేశంలోని 15 రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు గుడ్డు స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో పిల్లల మధ్యాహ్న భోజన పథకాల్లో, ఇంకొన్ని రాష్ట్రాలు రెండు పథకాల్లోనూ ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వారానికి నాలుగు రోజులపాటు పిల్లలకు ఆహారంలో కోడి గుడ్డును సరఫరా చేస్తుండగా, జమ్మూకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, తమిళనాడు వారానికి ఐదు రోజులు గుడ్డును సరహరా చేస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్మ భోజన పథకాలను అమలు చేస్తున్న అక్షయ పాత్ర, ఇస్కాన్ ఫుడ్ ఫౌండేషన్ సంస్థలు గుడ్డు స్కీమ్‌ను అమలు చేసేందుకు అస్సలు అంగీకరించడం లేదు. అలాంటప్పుడు అంతే పోషక విలువలుగల పాలు, పెరుగును సమృద్ధిగా సరఫరా చేయాలని 'రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్' కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌కు మాత్రం వారి నుంచి సమాధానం రావడం లేదు.
2006లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారత్‌లో 60 శాతం మంది మాంసాహారులున్నారు. సంపన్న వర్గాల్లో శాకాహారులు ఎక్కువగా ఉండగా, దళిత, నిమ్న వర్గాల్లో మాంసాహారాలు ఎక్కువగా ఉన్నారు. పోషక విలువలుగల గుడ్డును కూడా శాకాహారంగా పరిగణించాలంటూ శాకాహారుల్లో మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్న నేటి సమాజంలో పిల్లల నోటికాడి గుడ్డును లాగేసుకోవడం ఎంతవరకు సమంజసమో!