నేటి నుంచి ‘పది’ పరీక్షలు
భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ :
అర్ధరాత్రి దాటినా ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఏ టీవీ సీరియలో చూడడానికి కాదు- మర్నాడు జరగబోయే పరీక్షను ఎదుర్కోవడానికి! అందుకోసం కనీసం ఇద్దరు కచ్చితంగా మేలుకుని ఉంటారు. ఒకరు పరీక్ష రాయబోయే విద్యార్థి. మరొకరు- ఆ విద్యార్థిని కన్నతల్లి.
గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులున్న ప్రతి ఇంట్లో.. కొంచెం ఇంచుమించుగా ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకుంటాయంటే అతిశయోక్తి కాదు. ఆ తరగతి అనగానే ఆ తరహా ప్రాధాన్యం, ఆ పరీక్షలు అనగానే ఆ స్థాయి ఆదుర్దా స్థిరపడిపోయింది, మరి.
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ కేటగిరీల్లో మొత్తం 68,489 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్టు వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 30,291 మంది బాలురు, 30,462 మంది బాలికలు కాగా ప్రైవేట్ విద్యార్థుల్లో 4,180 మంది బాలురు, 3,756 మంది బాలికలు అని తెలిపారు.
రెగ్యులర్ విద్యార్థుల కోసం 271 పరీక్షా కేంద్రాలను, ప్రైవేట్ విద్యార్థుల కోసం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా పత్రాలను భద్రపరిచేందుకు 3 ట్రెజరీలను, 66 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ కేంద్రాలుగా వాడుతున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కేటగిరీ -ఎలో 13, కేటగిరీ-బిలో 212, కేటగిరీ -సిలో 87 ఉన్నాయన్నారు.
36 మంది రూట్ ఆఫీసర్లను, 15 స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని శాఖల సహాయసహకారాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.