'ఏనుగు డబ్బంతా తిన్నది.. సైకిల్‌కు పంచర్'
లక్నో: 'ఏనుగు(బీఎస్పీ) డబ్బంతా తిన్నది. సైకిల్ (ఎస్పీ)కి పంచర్ అయింది' అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా మాటల దాడి చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'దియోరియా టు ఢిల్లీ' యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం తన ఆరో రోజు ర్యాలీని ఆజంఘడ్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మహాశయుడి జన్మించిన మౌ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. దళితుల ఇంట్లో భోజనం చేశారు. రోడ్డు వెంట టీ తాగారు. దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఆయన బీఎస్పీ, ఎస్పీ, బీజేపీపై వ్యంగ్య విమర్శలు చేశారు. 'ఏనుగు(బీఎస్పీ) డబ్బంతా తిన్నది. మీరు దాన్ని వెంబడించారు కూడా. ఇక మీరు విసిగిపోయి సైకిల్(సమాజ్ వాది పార్టీ) తెచ్చుకున్నారు(సైకిల్ కు ఓటేశారు). కానీ అది పంచర్ అయిపోయి ఐదేళ్లుగా పనిచేయకుండా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని విరగ్గొట్టి పడేయాలి. ఇప్పుడు మీరు హస్తం(కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) గురించి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేం రేషన్ కార్డులకోసం ఏం చేస్తామో.. రైతులకు ఏం చేస్తామో మీరే స్వయంగా చూడొచ్చు. ప్రధాని మోదీ ఆయన ప్రపంచంలో ఆయన సంతోషంగా ఉన్నారు. గతంలో నేను చెప్పినట్లు ప్రజలు మాత్రమే సమస్యల్లో ఉన్నారు. మోదీ హ్యాపీ. ఆయన దృష్టంతా అమెరికా, జపాన్ అంటూ ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ.15లక్షలు వస్తాయని చెప్పారు. ప్రతి యువకుడికి ఉద్యోగం వస్తుందన్నారు. బుల్లెట్ రైళ్లు వస్తాయన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి' అంటూ రాహుల్ ప్రశ్నించారు.