
సైకిల్ కదలట్లేదు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం సమాజ్వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు.
జాన్‌పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం సమాజ్వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'డియోరియా టు ఢిల్లీ' యాత్రలో భాగంగా యూపీలోని ఖేటసారియాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సైకిల్(సమాజ్‌వాదీ పార్టీ సింబల్) ముందుకు కదలట్లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఏనుగు(బీఎస్పీ ఎన్నికల గుర్తు)ను తొలగించి సైకిల్‌కు అధికారం ఇస్తే అది కదలటం లేదన్నారు. సైకిల్ పంచరైందో లేక విరిగిపోయిందో తెలియదుగాని అది మాత్రం కదలడం లేదంటూ ప్రజల కేరింతల మధ్య రాహుల్ ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్ ఎకౌంట్‌లో 15 లక్షలు, యువకులకు ఉద్యోగాలు, బుల్లెట్ రైళ్లు లాంటి భారీ హామీలను మోదీ ఇచ్చారని.. అయితే అవి ఎప్పుడు దక్కుతాయని రాహుల్ ప్రశ్నించారు.