ఇక్కడ గిట్టుబాటు కాకే..ఈ పాట్లు!
ఎచ్చెర్ల:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విఫలం కావడం, మిల్లర్లు సరైన ధర ఇవ్వకపోవడం వల్లే ఇతర జిల్లాల వర్తకులకు ధాన్యం అమ్మడానికే ఇష్టపడుతున్నారు. దాని పర్యవసానంగానే తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం లోడ్లు తరలిపోతున్నాయి. అలా వెళుతున్న 30 లారీలను ఆదివారం అర్ధరాత్రి చిలకపాలెం వద్ద పౌరసరఫరా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఆ మేరకు ఈ ఖరీఫ్‌లో లెవీ సేకరణ లక్ష్యాన్ని రెండు లక్షల క్వింటాళ్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. కొండంత లక్ష్యం ముందున్నా వేరే జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం తరలిపోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రైతుల వాదన వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతోంది. వారి వాదన ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు వంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా .. ఆ స్థాయిలో కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమన కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. దళారులే నేరుగా కళ్లాల్లోకి వచ్చి ధాన్యం కొని ఇతర జిల్లాల మిల్లర్లకు అమ్ముతున్నారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే కంటే దళారులకు అమ్మడానికే ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువపరిమాణంలో ధాన్యం పండించే రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోవడమే దీనికి కారణం. కొనుగోలు కేంద్రాల్లోగానీ, జిల్లాలోని మిల్లర్లు గానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోవడం మరో కారణం.
మద్దతు ధర కావాలా.. ముదరా ఇవ్వండి
ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రేటు ఇవ్వాలంటే క్వింటాలుకు ఆరు కిలోలు ఎక్కువ ధాన్యం ఇవ్వాలని జిల్లాలోని పలువురు మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారన్నది రైతుల ఆరోపణ. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో స్థానిక మిల్లర్ల కంటే ఇతర జిల్లాల మిల్లర్లే మంచి ధర ఇస్తున్నారని, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తున్నారని నరసన్నపేట మండలం బద్రి గ్రామానికి చెందిన రైతులు చెప్పారు. అందువల్లే వరి ఎక్కువగా సాగు చేసే పోలాకి, గార, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం రూరల్ మండలాల నుంచి ధాన్యం నిల్వలు తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోతున్నాయంటున్నారు.
మద్దతు ధర విషయంలో విఫలమైన అధికారులు ఇతర జిల్లాలకు తరలివెళుతున్న ధాన్యాన్ని పట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికారుల దాడుల్లో రైస్ మిల్లర్లు పాల్గొనడమేమిటని నిలదీస్తున్నారు. దళారీ వ్యవస్థను, ఇతర జిల్లాలకు ధాన్యం రవాణాను అరికట్టాలనుకుంటే ముందు మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయడంతోపాటు గ్రామం యూనిట్‌గా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. ఇప్పటికే తుపాను కారణంగా దిగుబడి తగ్గిందని, ఈ పరిస్థితుల్లో ధాన్యం ఇతర జిల్లాలకు తరలిపోతే, ముందు ముందు జిల్లా బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టుబడిన ధాన్యంపై విచారణ
ఇదిలా ఉండగా జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్‌ప్లాజా సమీపంలోఆదివారం ఆర్ధరాత్రి వరకు పట్టుకున్న 30 ధాన్యం లారీలను ఎచ్చెర్ల పోలీస్ సే ్టషన్కు తరలించి, విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి, జిల్లా పౌరసర ఫరాల అధికారి ఆనందరావు, పౌరసరఫరాల సంస్థ ఏఎస్వో తిలగ, ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు తదితరలు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మిన రైతులు కొందరు కూడా స్టేషన్‌కు వచ్చి తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ధాన్యం కొనుగోలు ర సీదులు, ఆధార్ కార్డులు చూపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని ఆధారాలు ఉన్న ధాన్యం లారీలను విడిచిపెడతామని, ఆధారాలు చూపని లారీలపై 6(ఎ) కేసులు నమోదు చేసి జేసీ కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు పూర్తి రికార్డులు ఉన్న రెండు లారీలను విడిచి పెట్టాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. మరోపక్క పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నరసన్నపేట మండలానికి చెందిన కొందరు రైతులు తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మితే తప్పేమిటని అధికారులను ప్రశ్నించారు. కాగా గతంలో ఎప్పుడూ ఇటువంటి అభ్యంతరాలు రాలేదని కొందరు లారీ డ్రైవర్లు చెప్పారు.