సీఐడీ బాస్ ముందు భారీ సవాళ్లు
- అన్ని కేసులూ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనవే
- ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లోనే కేసుల దర్యాప్తు
- ఒత్తిళ్లు జయించి కేసుల్లో పురోగతి సాధించేనా?
సాక్షి, హైదరాబాద్: కొత్తగా సీఐడీ అదనపు డీజీపీగా బాధత్యలు స్వీకరించిన గోవింద్ సింగ్‌కు అనేక సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించిన ప్రతిష్టాత్మక కేసులన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. గతంలో పనిచేసిన అధికారులు ఆ కేసుల జోలికి పోకుండా సాదాసీదా దర్యాప్తు నిర్వహించారు. కానీ వీటిలో కొన్ని కేసులు చార్జిషీట్ దశకు చేరుకోగా, మిగతా కేసులు నత్తనడకన సాగుతున్న దర్యాప్తు దశలో ఉండిపోయాయి. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు.. మరోవైపు దర్యాప్తు అధికారుల పనితీరు సీఐడీ అదనపు డీజీపీని ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కేసుల్లో పురోగతి ఏది?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కే చంద్రశేఖర్ రావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవ కతవకలపై దర్యాప్తు ఆదేశించారు. మూడేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఇప్పటివరకు నింది తులను అరెస్ట్ చేయడం కాదు కదా కనీసం నోటీసులిచ్చే దశకు కూడా తీసుకెళ్లలేదు. పైగా ఈ విచారణ జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో కేసుకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో తెలియక గతంలో పనిచేసిన అధికారులు పక్కన పెట్టేశారు. ఇకపోతే సీఎంఆర్‌ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) స్కాంలోనూ సీఐడీ త్వరితగతిన దర్యాప్తు చేపట్టి 16 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసింది.
కానీ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉండగా రాజకీయ ఒత్తిడితో కేసును పెండింగ్‌లోనే పెట్టేశారు. భూదాన్ భూముల వ్యవహారంలోనూ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు ఆ కేసు దర్యాప్తు పట్టాలెక్కలేదు. అదేవిధంగా అగ్రిగోల్డ్ కేసులో రెండు కేసులు నమోదయినా.. ఈ కేసుల దర్యాప్తులో అంగుళం కూడా అభివృద్ధి కనిపించలేదు. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తుల స్వాధీనం, వేలం వరకు సీఐడీ తీసుకెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో అరెస్టు జరిగిపోయినా చార్జిషీట్ పెండింగ్‌లో పెట్టారు.
పట్టుబడని ‘ఎంసెట్ లీకేజీ’ నిందితుడు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎంసెట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో అసలు నిందితుడు ఇప్పటివరకు చిక్కలేదు. ఈ కేసులో బ్రోకర్లందరినీ అరెస్ట్ చేసినా.. కీలక వ్యక్తి పరారీలో ఉండటంతో లింక్ తెగిపోయి నట్లైంది. వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కోట్ల రూపాయల నకిలీ చలాన్ల స్కాంలో ఏ1 అరెస్టయినా కస్టడీ లోకి తీసుకొని విచారించలేక పోతున్నారు. ఈ కేసులో రైస్ మిల్లర్ల నుంచి ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉం దని పోలీస్ ఉన్నతాధికారులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏ విధంగా లాజికల్ ఎండింగ్‌కు తీసుకువస్తారు? అందరి దారిలోనే ఆయన కూడా నడుస్తారా? లేకా చార్జిషీట్ల వరకు తీసుకువస్తారా అన్నది సీఐడీలో చర్చనీయాంశమైంది.