ఉద్యమ దిక్సూచి జయశంకర్
- రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని నమ్మిన వ్యక్తి
- ‘సార్’ ఆశయూలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మించుకుందాం
- భవిష్యత్తులో పథకాల అమలుకు
- సామాజిక సర్వే కీలకం
- ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య
హన్మకొండ సిటీ : జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అని, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నారని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశాక సిద్ధాంత కర్తగా ఉన్నారని పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాజయ్య.. స్పీకర్ మధుసూదనాచారితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధించుకుందామని జయశంకర్ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన క్రమంలో జయశంకర్ లేకపోవడం బాధాకరమన్నారు. జయశంకర్ ఆశయాలకనుగుణంగా నడుచుకుంటూ బంగారు తెలంగాణను నిర్మించుకుందామన్నారు. ప్రజలందరికీ న్యాయం జరిగేం దుకే తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటంబ సర్వేను చేపట్టిందని, ఈ నెల 19వ తేదీన చేపట్టనున్న సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని, అధికారులకు పూర్తి వివరాలు వెల్లడించాలని రాజయ్య కోరారు. సర్వేను నిర్లక్షం చేయొద్దని, భవిష్యత్తులో పథకాల అమలుకు ఈ సర్వే కీలకం కానుందన్నారు. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడానిక మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. కొత్త పథకాలతో ముందుకు పోతోందన్నారు.
చిన్ననాటి నుంచే ఉద్యమంలో పాల్గొన్న
జయశంకర్
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిన్ననాటి నుంచే పాల్గొన్నారని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆంధ్రాలో తెలంగాణను కలిపితే తెలంగాణ దోపిడీకి, అన్యాయానికి గురవుతుందని 19 ఏళ్ల వయసులోనే జయశంకర్ వ్యతిరేకించారన్నారు. జయశంకర్ 1975లో సీకేఎం కాలేజీలో చదివినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయనకు తాను శిష్యునిగా ఉన్నానన్నారు. 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుని ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లగా.. రాజకీయాలు రెండు రకాలుంటాయని చెప్పారన్నారు. ఎగిరి వచ్చిన నాయకులు, ఎదిగి వచ్చిన నాయకులుంటారని, నీవు ఏ నాయకుడివో నిర్ణయించుకోమని చెప్పారని గుర్తు చేశారు.
ఉద్యమ భావ వ్యాప్తికి కృషి చేశారు
ప్రొఫెసర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీపై ప్రజలకు తెలిసేలా భావ వ్యాప్తికి కృషి చేశార ని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిఅన్నారు. జయశంకర్ కోరుకున్న తెలంగాణను నిర్మించడమే.. ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య విద్యుత్ సమస్య అని మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నామని, పవర్ ప్రాజెక్టులన్నీ ఏపీలో ఉండడంతో ఈ సమస్య తలెత్తుతుందన్నారు. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే లక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు.
ఉన్నత విద్య పరిశోధనాత్మకంగా ఉండాలనేవారు...
ఉన్నత విద్య పరిశోధనాత్మకంగా, ప్రజలకు పనికి వచ్చేదిగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ అనే వారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. కాకతీయ యూనివర్శిటీకి ఆంధ్రకు చెందిన వ్యక్తిని వైస్ చాన్స్‌లర్‌గా నియమించినప్పుడు వ్యతిరేకించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా స్వేచ్చగా ఉందామని అనుకొంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులకే ఆర్థిక పథకం అందిస్తామంటే గగ్గోలు పెడుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే ఉద్యమం చేశారని అన్నారు. ఓరుగల్లు సేవా సమితి ట్రస్టు ద్వారా అమరుల కీర్తి స్థూపాన్ని, జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ క్రమంలో జయశంకర్ సార్ లేకపోవడ పెద్ద లోటేనని అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొఫెసర్ జయశంకర్ సృతి వనాన్ని నిర్మించాలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మహోన్నతమైందన్నారు. ఎమ్మెల్యే కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకై నిరంతరం తపించిన వ్యక్తి జయశంకర్ అని అన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణకై పోరాడారన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ప్రజల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ విశ్వమానవుడు జయశంకర్ అని, ఉద్యమంలో ప్రతి తెలంగాణవాదిని భాగస్వాములను చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకపోతే జిల్లాకు ఉపముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు దక్కి ఉండేవి కావన్నారు. జయశంకర్ రచనలను పాఠ్యపుస్తకాలో పాఠ్యాంశాలుగా చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, నగరపాలక సంస్థ కమిషనర్ సువర్ణపండదాస్, జిల్లా పరిషత్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, డీఐజీ ఎం.కాంతారావు, ఎస్పీ వెంకటేశ్వర్రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, జిల్లా రెవిన్యూ అధికారి సురేంధ్రకరణ్ పాల్గొన్నారు. జయశంకర్ దత్తపుత్రడు బ్రహ్మంతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉద్వేగానికి లోనైన కలెక్టర్
హన్మకొండ సిటీ : జయశంకర్ విగ్రహావిష్కరణ సభలో వక్తలు ప్రసంగిస్తుండగా జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పరిటాల సుబ్బారావు ప్రసంగిస్తూ ఓరుగల్లు సేవా సమితి ఏర్పాటు చేసి.. దాని ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అమరవీరుల కీర్తి స్తూపాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కలెక్టర్ కిషన్ రాత్రి 12 గంటల వరకు పని చేస్తున్నారని, కీర్తి స్తూపంతో పాటు ఓరుగల్లు సేవా సమితిచే జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెబుతూ తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరులను గుర్తు చేస్తున్న క్రమంలో కలెక్టర్ కిషన్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చేతిరుమాలుతో కళ్ళను అద్దుకొంటూ కలెక్టర్ తనకు తానే నిగ్రహించుకునే ప్రయత్నం చేశారు.