లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు
మంచిర్యాల (ఆదిలాబాద్) : తెలంగాణ ప్రజల ఆశల సౌధం అయిన మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి భాగోతాలు తొంగిచూస్తున్నాయి. చెరువు పనుల బిల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం వెలుగుచూసింది.
ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈగా పని చేస్తున్న వినోద్, డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న బాలసిద్ధు కరీంనగర్‌కు చెందిన మిషన్ కాకతీయ కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిని బిల్లులు మంజూరు కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో శక్రవారం ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు ఈఈకి రూ. 40 వేలు, డిప్యూటీ ఈఈకి రూ. 60 వేలు లంచం ఇస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.