'డేరా' నుంచి 18 మంది బాలికలకు విముక్తి
రోహతక్: లైంగిక వేధింపులు కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలుకు వెళ్లడంతో ఆయన ఆశ్రమంలోని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం నుంచి 18 మంది బాలికలను స్థానిక అధికారులు రక్షించారు. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
15 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్‌కు సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు. డేరా కార్యాలయంలో వెయ్యి మంది వరకు ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ బయటకు పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సిర్సాలో భద్రత కొనసాగుతోంది. గుర్మీత్ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు దిగకుండా భారీ ఎత్తున భద్రతా దళాలను మొహరించారు.