దేవరచర్లలో ప్రకృతి అద్భుతం
దేవరకొండ: చుట్టూ కొండలు.. దట్టమైన అడవులు.. నింగి నుంచి జాలువారే నీటి పరవళ్లు.. గంగమ్మ శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. మనసును ఇట్టే కట్టి పడేసే ఈ ప్రకృతి సోయగాలు చూడాలంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లకు వెళ్లాల్సిందే! ఈ గ్రామానికి సమీపంలోని ముని స్వామి గుట్టలు రమణీయ దృశ్యాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. అక్కడ్నుంచి సుమారు 5 కి.మీ. నడిస్తే చేరుకునే ప్రాంతం మునిస్వామిగుట్ట. ఇక్కడ జలపాతం జాలువారే చోటే కొలువైన శివలింగం, వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కనువిందు చేస్తున్నాయి.
గుట్టల నడుమ ఆలయం, ఆ పక్కనే సొరంగ మార్గం ఉంది. ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం చుట్టు ప్రక్కల ఉండే గిరిజనులు మాత్రం.. తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆ ప్రాంతంలో శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతున్నారు. ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ పర్వదినాల్లో గుట్టపై నిర్వహించే జాతరకు వందల మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. వాస్తవంగా దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఆలయంలోని స్తంభాలపై చెక్కిన పద్మాలను (పుప్పాలు) బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది. ప్రస్తుతం చెట్లు పడడంతో ఆలయం కొంతమేర కూలిపోయి కనిపిస్తోంది.
ఎన్నెన్నో విశేషాలు: కొండపై కొలువైన శివలింగంపై ఎప్పుడూ గుట్టల నుంచి జాలు వారుతున్న నీటి పరవళ్లు అభిషేకిస్తూనే ఉంటాయి. మునుస్వామి ఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో గుట్టనే ఆలయంగా మలిచారు. ఓచోట చతురస్రాకారంలో ఉన్న ఇటుకలతో ఒక నిర్మాణం ఉంది. ఆ ఇటుకలు కేవలం 200 నుంచి 300 గ్రాముల బరువున్నాయి.
ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే అక్కడి కందిరీగలు, గబ్బిలాలు హాని చేస్తాయని ఇక్కడి గిరిజనులు విశ్వసిస్తారు. గుడిలోనే కాకుండా శిథిలావస్థకు చేరిన మరొక ఆలయ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ శివలింగం చుట్టూ చిన్న సైజులో మరో 18 చిన్న లింగాకారాలున్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రహస్య సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఇక్కడ గోపా బావోజీ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు.