కౌలు చెల్లించని రైతులకు నోటీసులు
సంతకవిటి : దేవాలయాల భూములును కౌలుకు తీసుకుని సకాలంలో కౌలు చెల్లించని రైతులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ లక్ష్మీనృసింహం ఆదేశించారు. గుళ్ళసీతారాంపురం గ్రామంలో సీతారాములు ఆలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న సీతారాములు కల్యాణోత్సవంలో పాల్గొనడంతో పాటు ఆలయ గర్భగుడిలో సీతారాముల ప్రతిమలకు పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ఆలయ అర్చకులు ప్రసాద్‌శర్మ వద్ద వివరాలు సేకరించారు. ఆలయ అబివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంలో పంచాయతీ పెద్ద డాక్టర్ కృష్ణారావు ఆలయ భూములు నుంచి రాబడి రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా దేవాలయ భూములుపై ఆరా తీశారు. శ్రీకూర్మం వద్ద ఈ ఆలయానికి సంబంధించి 250 ఎకరాలు భూమి ఉందని, కౌలు రావడం లేదని దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్యామలదేవి అన్నారు. వెంటనే ఆ రైతులను సంప్రదించి కౌలు వసూలు చేయాలని, ఇవ్వకుంటే రైతులకు నోటీసులు ఇచ్చి భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ సర్పంచ్ రావు రవీంద్ర, ఎంపీటీసీ సభ్యులు యినుమల మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.