devis cup
-
భారత డేవిస్ జట్టులో నగాల్‌కు చోటు
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులోకి సుమిత్ నగాల్ తిరిగి ఎంపికయ్యాడు. గతేడాది మార్చిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో పోటీపడిన నగాల్ తర్వాత డేవిస్ బరిలో దిగలేదు. తుంటి గాయంతో గత సెప్టెంబర్‌లో ఫిన్లాండ్తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. నవంబర్‌లో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్తోనూ బరిలోకి దిగలేకపోయాడు. ఏప్రిల్‌లో ఏటీపీ సర్క్యూట్లో ఆడటం మొదలుపెట్టిన 24 ఏళ్ల హరియాణా టెన్నిస్ స్టార్ సుమిత్ ఈ సీజన్లో ఎనిమిది టోర్నీల్లో తలపడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాడు. సుమిత్ డేవిస్ జట్టులోకి రావడంతో డబుల్స్ స్పెషలిస్టు దివిజ్ శరణ్‌ను పక్కన బెట్టారు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో నార్వేతో భారత్ తలపడుతుంది. మ్యాచ్‌లు నార్వేలో జరుగుతాయి. రోహిత్ రాజ్‌పాల్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల భారత డేవిస్ జట్టును గురువారం ఎంపిక చేశారు. రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గునేశ్వరన్, యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లతో పాటు వెటరన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత్, నార్వే జట్లు తలపడటం డేవిస్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే–ఆఫ్‌లో భారత్ 4–0తో డెన్మార్క్‌పై ఘనవిజయం సాధించింది. -
భారత్ అన్నీ గెలిచింది!
బ్యాంకాక్ : జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో మొదట న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ వెంటనే కోలుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై క్లీన్‌స్వీప్ చేసింది. అజయ్ మలిక్ సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ పోరులో మొదట సింగిల్స్ ఆడిన అజయ్ 6–4, 6–2తో మో గునవన్ త్రిస్మువంతరను కంగుతినిపించాడు. రెండో సింగిల్స్‌లో సుశాంత్ దబస్ 6–0, 6–0తో నౌవల్డొ జతి అగత్రపై గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన డబుల్స్‌లో అజయ్–దివేశ్ గెహ్లాట్ జోడీ 6–7 (6/8), 6–2, 10–4తో నౌవల్డొ అగత్ర–లక్కీ కెండ్ర కుర్నివాన్ జంటపై గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో భారత్... ఆసియా ఓసియానియా గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
పేస్ ప్రపంచ రికార్డు
తియాన్‌జెన్ (చైనా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్ కప్‌లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నికోల పెట్రాజెలీ (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ బద్దలు కొట్టాడు. తొలుత డబుల్స్‌లో పేస్–రోహన్ బోపన్న జోడీ గెలిచి ఆశలు నిలబెట్టగా... రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నెగ్గడంతో భారత్ 3–2తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని... వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లోనూ పరాజయం పాలైన భారత జట్టు చావో రేవో మ్యాచ్‌లో సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక డబుల్స్ మ్యాచ్‌లో పేస్–బోపన్న జోడీ 5–7, 7–6 (5/7), 7–6 (3/7)తో మావో జిన్ గాంగ్–జీ జాంగ్ జంటపై గెలుపొందింది. అనంతరం తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ 7–6 (7/4), 6–3తో డి వూ పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 6–2తో వీబింగ్ వూను ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ప్రపంచ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనతను నా తల్లిదండ్రులకు, నా కూతురు అయానాకు, డేవిస్ కప్ కెప్టెన్లకు, సహచరులకు, దేశ ప్రజలందరికి అంకితమిస్తున్నా. నేను భారత గడ్డపై పుట్టి, సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అందుకే వేటిని అతిగా తీసుకోకుండా స్నితప్రజ్ఞతతో ముందుకెళ్తున్నా. డేవిస్ కప్‌లో 0–2తో వెనుకబడిన అనంతరం తిరిగి పుంజుకోవడం గొప్ప అనుభూతి. ఈ ఘనత మరెందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. – లియాండర్ పేస్ -
ఢిల్లీలో డేవిస్ కప్ మ్యాచ్
న్యూఢిల్లీ: స్పెయిన్‌తో భారత జట్టు తలపడబోయే డేవిస్ కప్ మ్యాచ్‌కు ఢిల్లీ వేదికగా ఎంపికైంది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో భారత్ ఈ మ్యాచ్‌లు ఆడనుంది. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా పోటీలు జరగనున్నాయి. ఢిల్లీ లాన్ అసోసియేషన్‌కు చెందిన హార్డ్ కోర్టులు మ్యాచ్‌లకు వేదికగా నిలవబోతున్నాయి. గ్రాస్ కోర్టుల్లో మ్యాచ్‌లు జరపాలని ప్రయత్నించామని, వర్షాకాలం కావడంతో హార్డ్ కోర్టులను ఎంపిక చేశామని భారత టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భరత్ తెలిపారు. -
డేవిస్ కప్ లో సోమ్ దేవ్ విజయం
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత కెప్టెన్ సోమ్ దేవ్ దేవ్ బర్మన్ ఘనవిజయం సాధించాడు. ఈ రోజ జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ 7-6, 6-4, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరీ వెస్లీని ఓడించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో భారత్ కాస్త ఆందోళనకు గురైంది. కాగా, అనంతరం జరిగిన మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్ తన దైన శైలిలో రెచ్చిపోయాడు. ప్రపంచ 40 వ ర్యాంక్ ఆటగాడు వెస్లీని వరుస సెట్లలో మట్టికరిపించి స్కోరును 1-1 గా సమం చేశాడు. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించడం పట్ల సోమ్ దేవ్ హర్షం వ్యక్తం చేశాడు. 'నేను అత్యుత్తమ సర్వీసులతో ఆకట్టుకున్నా. నా కెరీయర్ లో చేసిన ఉత్తమ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. నా ఆటతీరుకు నిబంధనలు కూడా బాగా అనుకూలించాయి. తొలుత కాస్త అలసటకు గురైనా.. తరువాత బాగా ఆడి మ్యాచ్ ను గెలుచుకున్నా. నా విజయంలో 75 శాతం పాయింట్లు సర్వీసుల ద్వారానే రావడం నిజంగా సంతోషంగా ఉంది' అని సోమ్ దేవ్ తెలిపాడు. -
‘చెక్’ జట్టుకే డేవిస్ కప్ టైటిల్
బెల్గ్రేడ్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ జట్టు నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో 2012 చాంపియన్ చెక్ రిపబ్లిక్ 3-2తో సెర్బియా జట్టుపై గెలిచింది. నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 7-6, 6-2తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గడంతో స్కోరు 2-2వద్ద సమం అయింది. నిర్ణాయక మ్యాచ్‌లో రాడెక్ స్టెపానెక్ 6-3, 6-1, 6-1తో లాజోవిక్ (సెర్బియా)ను ఓడించి చెక్ రిపబ్లిక్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 1981లో డేవిస్ కప్‌లో వరల్డ్ గ్రూప్ దశ పోటీలు మొదలయ్యాక వరుసగా రెండేళ్లు ఈ టైటిల్ నెగ్గిన ఐదో జట్టుగా చెక్ రిపబ్లిక్ గుర్తింపు పొందింది. అంతకుముందు స్పెయిన్ (2008, 2009), స్వీడన్ (1997, 1998; 1984, 1985), జర్మనీ (1988, 1989), అమెరికా (1981, 1982) ఈ ఘనత సాధించాయి.