‘చెక్’ జట్టుకే డేవిస్ కప్ టైటిల్
బెల్‌గ్రేడ్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ జట్టు నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో 2012 చాంపియన్ చెక్ రిపబ్లిక్ 3-2తో సెర్బియా జట్టుపై గెలిచింది. నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 7-6, 6-2తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గడంతో స్కోరు 2-2వద్ద సమం అయింది. నిర్ణాయక మ్యాచ్‌లో రాడెక్ స్టెపానెక్ 6-3, 6-1, 6-1తో లాజోవిక్ (సెర్బియా)ను ఓడించి చెక్ రిపబ్లిక్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 1981లో డేవిస్ కప్‌లో వరల్డ్ గ్రూప్ దశ పోటీలు మొదలయ్యాక వరుసగా రెండేళ్లు ఈ టైటిల్ నెగ్గిన ఐదో జట్టుగా చెక్ రిపబ్లిక్ గుర్తింపు పొందింది. అంతకుముందు స్పెయిన్ (2008, 2009), స్వీడన్ (1997, 1998; 1984, 1985), జర్మనీ (1988, 1989), అమెరికా (1981, 1982) ఈ ఘనత సాధించాయి.