పేస్‌ ప్రపంచ రికార్డు  | Leander Paes dedicates world record to India | Sakshi
Sakshi News home page

పేస్‌ ప్రపంచ రికార్డు 

Published Sun, Apr 8 2018 1:29 AM | Last Updated on Sun, Apr 8 2018 1:29 AM

Leander Paes dedicates world record to India - Sakshi

తియాన్‌జెన్‌ (చైనా): భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్‌ కప్‌లో అత్యధికంగా 43 డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నికోల పెట్రాజెలీ (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్‌ బద్దలు కొట్టాడు. తొలుత డబుల్స్‌లో పేస్‌–రోహన్‌ బోపన్న జోడీ గెలిచి ఆశలు నిలబెట్టగా... రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ నెగ్గడంతో భారత్‌ 3–2తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని... వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లోనూ పరాజయం పాలైన భారత జట్టు చావో రేవో మ్యాచ్‌లో సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌–బోపన్న జోడీ 5–7, 7–6 (5/7), 7–6 (3/7)తో మావో జిన్‌ గాంగ్‌–జీ జాంగ్‌ జంటపై గెలుపొందింది. అనంతరం తొలి రివర్స్‌ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 7–6 (7/4), 6–3తో డి వూ పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 6–4, 6–2తో వీబింగ్‌ వూను ఓడించడంతో భారత్‌ విజయం ఖాయమైంది.  

ప్రపంచ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనతను నా తల్లిదండ్రులకు, నా కూతురు అయానాకు, డేవిస్‌ కప్‌ కెప్టెన్‌లకు, సహచరులకు, దేశ ప్రజలందరికి అంకితమిస్తున్నా. నేను భారత గడ్డపై పుట్టి, సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అందుకే వేటిని అతిగా తీసుకోకుండా స్నితప్రజ్ఞతతో ముందుకెళ్తున్నా. డేవిస్‌ కప్‌లో 0–2తో వెనుకబడిన అనంతరం తిరిగి పుంజుకోవడం గొప్ప అనుభూతి. ఈ ఘనత మరెందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా.    – లియాండర్‌ పేస్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement