కల్తీ పెట్రోల్ పోశారు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో 10 రోజుల క్రితం కల్తీ పె ట్రోల్ విక్రయిస్తున్నారని వాహనదారుల ఆందోళనతో విచారణ జరిపిన అధికారులు బంక్‌ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను మరవక ముందే పట్టణంలోని మరో పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ వచ్చిందని ఓ ద్విచక్ర వా హనదారుడు శుక్రవారం ఆందోళ న చేశాడు. వాహనదారుడి వివరా ల ప్రకారం.. పట్టణానికి చెందిన గడీల బైరయ్య ఉదయం పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద గ ల బంకులో తన ద్విచక్ర వాహనం లో *100 పెట్రోల్ పోయించుకున్నాడు. కాస్త దూరం వెళ్లగానే బం డి ఎంతకు స్ట్రాట్ కాకుండా మొరాయించడంతో బైక్‌ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడ బైక్‌ను పరిశీలించిన తర్వాత పెట్రోల్‌పై అనుమానం రావడంతో మెకానిక్ పెట్రోల్‌ను బాటిల్లో తీసి పరిశీలించగా రంగులో మార్పు, నీ రు కలిసిన పెట్రోలు వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్‌బంక్‌కు వెళ్లి సిబ్బంది, బంకు నిర్వాహకులతో గొడవకు దిగాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని అక్కడినుంచి వెళ్లిపోయాడు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో కల్తీలు జరుగుతున్నాయని వాహనదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఈ పెట్రోల్ వాడిన వాహనాలు దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీలను అరికట్టాలని కోరుతున్నారు.