Dewan Housing Finance
-
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
పిరమల్ గ్రూప్ చేతికి డీహెచ్ఎఫ్ఎల్
ముంబై: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలకు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. రుణ పరిష్కారంలో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్‌దారులతోపాటు.. రుణదాతలు మొత్తం రూ. 38,000 కోట్లు రికవర్ చేసుకున్నట్లు వివరించింది. నగదు, మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్) సుమారు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. రిజల్యూషన్‌లో భాగంగా డీహెచ్ఎఫ్ఎల్ వద్దగల మరో రూ. 3,800 కోట్లను రుణదాతలు పొందగలిగినట్లు తెలియజేసింది. ఐబీసీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ సరీ్వసుల రంగంలో విజయవంతమైన తొలి రుణ పరిష్కార ప్రణాళికగా డీహెచ్ఎఫ్ఎల్ను పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. ఇకపై రిజల్యూషన్లకు ఇది నమూనాగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలను(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్, డీహెచ్ఎఫ్ఎల్) విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. విలీన సంస్థను పిరమల్ క్యాపిటల్ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
మార్కెట్ల పతనం- దివాన్, ఏఆర్ఎస్ఎస్ జోరు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ బోర్లా పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 648 పాయింట్లు పతనమై 43,875కు చేరింది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్బీఎఫ్సీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి రూ. 210 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా మేఘాలయ ఎన్‌హెచ్-40లో రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. జేఐసీఏ రుణ మద్దతుకింద ఈపీసీ పద్ధతిలో ఈ కాంట్రాక్టు దక్కినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 15.45 వద్ద ఫ్రీజయ్యింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తుల విక్రయానికి అధిక ధరలో బిడ్స్ దాఖలు చేయమని ఆహ్వానించవలసిందిగా రుణదాతలు కోరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దివాళా చట్టానికి లోబడి ఎన్సీఎల్టీకి చేరిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలిచిన డీహెచ్ఎఫ్ఎల్పై నేడు రుణదాతల కమిటీ(సీవోసీ) ఓటు వేయనున్నట్లు తెలుస్తో్ంది. కంపెనీలో వాటా కొనుగోలు లేదా కొన్ని ఆస్తుల కొనుగోలుకి అదానీ గ్రూప్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, యూఎస్ కంపెనీ ఓక్ట్రీ, హాంకాంగ్ సంస్థ ఎస్సీ లోవీ తదితరాలు 10-70 శాతం అధిక ధరలలో బిడ్స్ దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై నేడు సీవోసీ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 24.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా దరఖాస్తుకు ఎన్సీఎల్టీ ఓకే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్ ప్రవేశానికి అర్హమైనదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్ఎఫ్ఎల్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద ఆర్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర బీఎస్ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్ సర్క్యూట్ (ఒక రోజులో స్టాక్ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది. -
250 కోట్ల విద్యారుణాల లక్ష్యం: అవాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ కంపెనీ ‘అవాన్స్’ విద్యారుణాలపై మరింత దృష్టిసారించనున్నట్లు తెలిపింది. ఐదేళ్లలో రూ.5,000 కోట్ల విద్యారుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అవాన్స్ పేర్కొంది. గడిచిన ఏడాది రూ. 50 కోట్ల విలువైన రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది రూ. 250కోట్లు ఇవ్వనున్నట్లు అవాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ సక్సేనా తెలిపారు.. హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీరజ్ మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి దేశీయ విద్యా రుణాల విలువ 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, ప్రస్తుతం రూ.80,000 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఏటా 24 లక్షల మంది విద్యార్థులు చేరుతుండటంతో రాష్ట్రమార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారుణాల మార్కెట్ రూ.6,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. విద్యారుణాలకే కాకుండా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు, వాటికి కావల్సిన ముడిసరుకు సరఫరాలకు సంబంధించిన విభాగాల్లో కూడా రుణాలకు మంచి డిమాండ్ ఉందని, వచ్చే నెల నుంచి వీటికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యారుణాలకే ఎక్కువ ప్రాధానత్యను ఇస్తున్నామని చెప్పారు.