చదువు.. సంపాదించు!
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ఓ విషయంలో మాత్రం ముందుంది. పేద కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలో బాలికలు ఆర్థికంగా తమ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. అలాగని వారు చదువుకు దూరం కావడం లేదు. ఒకవైపు చుదువుకుంటూనే.. మరోవైపు చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదనలో పడుతున్నారు. ఈ విషయంలో బాలుర కంటే ముందున్న బాలికలు.. చదువులో మాత్రం ఇప్పుడిప్పుడే వారితో పోటీ పడుతున్నారు. సెస్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో బాలికలే చదువు విషయంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు, ఓ వైపు పనుల కెళ్తూ మరోవైపు విద్యాభ్యాసానికి తాపత్రయపడుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలెప్మెంట్(డీఎఫ్ఐడీ) విభాగం పర్యవేక్షణలో హైదరాబాద్కు చెందిన ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ(సెస్)కు చెందిన ఓ బృందం శ్రీకాకుళం, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో పలు అంశాలపై సర్వే చేశారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 750 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. మంగళవారం జెడ్పీ సమావేశం మందిరంలో కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని కలిసిన ఈ బృందం సభ్యులు ‘గ్రోయింగ్ అప్ ఇన్ పావర్టీ,
ఫైండింగ్స్ ఫ్రమ్ యంగ్ లైవ్స్ ఇన్ శ్రీకాకుళం’ పేరిట నాలుగో రౌండ్ అధ్యయన ఫలితాలను ఆయనకు వివరించారు. 2016లో చివరి రౌండ్ ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పిల్లలు, యువతీ యువకుల జీవన విధానం, చదువు, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాలతో పాటు పిల్లల పౌష్టికాహారంపైనా అధ్యయనం చేశారు. ‘యువత-అభివృద్ధి’ అనే అంశంలోనూ ఏడాది వయసున్న వారిపై ఓసారి, వారు ఐదేళ్ల వయస్సుకొచ్చినప్పుడు రెండోసారి, ఎనిమిదేళ్ల వయస్సుకొచ్చినప్పుడు మూడోసారి, 12 ఏళ్ల ప్రాయంలో నాలుగోసారి.. ఇలా నాలుగు రౌండ్లలో నిర్ణీత అంశాలను అధ్యయనం చేశారు. 8, 12, 15, 19యేళ్ల వయస్సున్న వారి నుంచీ కొన్ని వివరాలు సేకరించినట్లు సెస్ సంస్థ డెరైక్టర్ ఎస్.గలాబ్, రిటైర్డ్ అధికారి డా. పిపి.రెడ్డి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లాలో 61 శాతం మంది బాలికలు చదువుపై ఆసక్తి చూపిస్తుండగా.. వారిలో 48 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తున్నారు. 12 శాతం మంది పని చేసుకుంటూ చదువుకుంటున్నారని సర్వే చెబుతోంది. మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే ఈ జిల్లాలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని విషయాలనూ ఈ బృందం వెలుగులోకి తెచ్చింది. 39 శాతం మంది బాలికలు ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూనే చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నారని కూడా తేల్చారు.
ఎప్పుడు.. ఎలా..?
2006లో ప్రాథమిక పాఠశాలల్లో చేరిన 12 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య 90 శాతం కాగా..2013 నాటికి అది 97 శాతానికి పెరిగింది.
2006 నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడపిల్లలే అధికంగా పాఠశాలల్లో చేరినట్టు తేలింది. వీరిలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారూ ఉన్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న 12 ఏళ్ల పిల్లల సంఖ్య 2006-13 మధ్య కాలంలో 28 శాతం నుంచి 37 శాతానికి పెరిగింది.
2013 సర్వే ప్రకారం 43 శాతం మంది అబ్బాయిలు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతుంటే.. అమ్మాయిల సంఖ్య 31 శాతంగానే ఉంది.
గణితం సబ్జెక్టులో 2006-13 మధ్య 12 ఏళ్ల పిల్లలను సర్వే చేయగా 14 శాతం మందికి ఆ సబ్జెక్టులో ఆసక్తి తక్కువగా ఉన్నట్టు తేలింది.
2006-13మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. 14 శాతం మంది పిల్లలు అపరిశుభ్రత మధ్యే కాలం గడుపుతున్నారు.
సగానికి పైగా విద్యార్థులు 19 ఏళ్ల నాటికీ విద్య పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ 7 శాతం మంది ఇంకా సెకండరీ స్కూల్ విద్య పూర్తి చేయాల్సి ఉండగా, 9శాతం మంది పీజీ/వృత్తి విద్య, మరికొంతమంది యూనివర్సిటీ స్థాయిలో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్ని ఆసక్తికర అంశాలు
12 ఏళ్ల వయసువారిలో 3 శాతం మంది చదువుపై ఆసక్తి చూపడం లేదు.
2006-13 మధ్య కాలంలో 12 ఏళ్ల పిల్లల్లో 28 నుంచి 37 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకు ఆసక్తి కనబరిచారు. అందులో 43 శాతం అబ్బాయిలుంటే 31 శాతం అమ్మాయిలున్నారు.
2006లో సేకరించిన వివరాల ప్రకారం లెక్కల సబ్జెక్టులో 14 శాతంమంది తక్కువ ఆసక్తి కనబర్చినట్టు తేలింది.
6-14 ఏళ్ల మధ్య పిల్లలు చట్ట ప్రకారం నిర్బంధ విద్యకు అర్హులు. దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో (డైస్ 2103 ప్రకారం) ఈ వియసు పిల్లలు పాఠశాలల్లో చేరుతున్నప్పటికీ విద్యపై అంతగా ఆసక్తి కనబరచడం లేదని తేలింది.
యంగ్ లైవ్స్ పేరిట జరిగిన నాలుగు రౌండ్ల సర్వేలో 12 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడితోనే పాఠశాలలకు వెళ్తున్నట్టు వెల్లడైంది.