ఇది డైరీ కథ!
డీజీపీ పదవికే ఎసరు పెట్టిన వైనం
సచివాలయంలో రసవత్తర చర్చ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అత్యంత ప్రముఖుల జీవితాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల వెనుక ఆసక్తికరమైన విషయాలు దా గి ఉంటాయని మాజీ డీజీపీ అశోక్‌కుమార్ విషయంలో మరోసారి రుజువైంది. కీలకమైన ఒక డైరీ వ్యవహారమే ఆయన నిష్ర్కమణకు దారితీసినట్లు తెలుస్తోంది. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర చెన్నైలో పాన్, గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయనే సమాచారాన్ని అందుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల ఆకస్మికదాడులు నిర్వహించారు. మాధవరావు, శ్రీనివాసరావు అనే సోదరులకు చెందిన గిడ్డంగుల నుంచి కోట్ల రూపాయల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల సమయంలో రావు సోదరుల నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో అప్పటి చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న జార్జ్ పేరు మొదలుకుని సచివాలయంలోని పలువురి అధికారులకు చెల్లిస్తున్న ‘కప్పం’ లెక్కల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ డైరీ ఆదాయపు పన్నుశాఖ అధికారుల చేతికి చిక్కడం కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు పుట్టించి హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక అమ్మ సామ్రాజ్యానికి కొందరు అధికారులను దూరంగా పెట్టి ఏకాకిగా మారుస్తున్న గార్డెన్‌కు చెందిన అధికారుల పేర్లు కూడా డైరీలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి నెలకు రూ.20 లక్షల ‘కప్పం’ కడుతున్నట్లు డైరీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అనాడు పోలీస్ కమిషనర్‌గా ఉండిన జార్జ్‌కు గార్డెన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నందున డీజీపీ అశోక్‌కుమార్ ఆదేశాలను ఖాతరు చేయలేదని తెలుస్తోంది. అయితే అదనుకోసం వేచిఉన్న అశోక్‌కుమార్ ఎట్టకేలకూ కమిషనర్ బాధ్యతల నుంచి జార్జ్‌ను తప్పించి టీకే రాజేంద్రన్‌ను నియమించగలిగారు. కమిషనర్ బాధ్యతల్లో లేకున్నా గార్డెన్ సంబంధాలను జార్జ్ కొనసాగించగలిగారు. తనంటే లెక్కచేయని జార్జ్ తదితర అధికారులను గుప్పిట్లో ఉంచుకునేందుకు సదరు డైరీని చేజిక్కించుకోవాలని అశోక్‌కుమార్ పథకం పన్నారు. డైరీలోని వివరాలతో ఒక నకలును ఆదాయపు పన్నుశాఖాధికారుల నుంచి సంపాదించాల్సిందిగా సీబీఐలో ఉన్న ఒక ఉన్నతాధికారిని అశోక్‌కుమార్ ఆదేశించారు. సదరు అధికారి ఆదాయపు పన్నుశాఖ అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి కోరగాతమ వద్ద ఉన్న డైరీ నుంచి నక ళ్లను ఇవ్వడం కుదరదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారమంతా గార్డెన్‌కు చెందిన సచివాలయ అధికారుల బృందం చెవినపడింది. అశోక్‌కుమార్ సదరు డైరీ నకళ్లను సంపాదించి డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి ఇచ్చే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి జయలలితకు గార్డెన్ అధికారులు ఫిర్యాదులు మోసారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరుణానిధిని డీజీపీ అశోక్‌కుమార్ కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామంతో జయలలిత మరింతగా మండిపడ్డారు.
తన పట్ల జయ అగ్రహంతో ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న అశోక్‌కుమార్ ఇక పదవిలో ఉండడం సాధ్యం కాదని తెలుసుకుని రాత్రికి రాత్రే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) నిర్ణయం తీసుకున్నారు. అశోక్‌కుమార్‌ను డీజీపీ పదవి నుంచి సాగనంపేందుకు ఇదే సమయమని భావించి జయలలిత సైతం వీఆర్ఎస్కు ఆమోదముద్ర వేయడంతో రాత్రికి రాత్రే ఆయన ఆఫీసును వదిలి వెళ్లిపోయారు. డీజీపీ స్థాయి అధికారి పదవీ విరమణ పొందినపుడు ప్రొటోకాల్ ప్రకారం ఇతర అధికారులందరూ కలిసి ఇవ్వాల్సిన ఘనమైన వీడ్కోలు స్వీకరించకుండానే అశోక్‌కుమార్ నిష్ర్కమించాల్సి వచ్చింది.