ధనుష్ సర్టిఫికేట్లు ఫేక్!
ఆయన కోర్టుకు సమర్పించిన జన్మధ్రువపత్రంలో పేరు లేదు
వృద్ధ దంపతుల లాయర్ స్పష్టీకరణ
ప్రముఖ తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వృద్ధ దంపతులు వేసిన కేసు కొత్త మలుపుతిరిగింది. పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చునని, ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు కోర్టులో స్పష్టం చేయడంతో రజనీకాంత్ అల్లుడైన ఈ హీరోకి కోర్టులో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
లేజర్ చికిత్సతో ధనుష్ తన పుట్టుమచ్చలు తొలగించుకున్నాడని డాక్టర్లు కోర్టుకు సమర్పించిన నివేదికతో స్పష్టమైందని వృద్ధ దంపతుల తరఫు న్యాయవాది మంగళవారం మీడియాకు తెలిపారు. కోర్టులో ధనుష్ సమర్పించిన జన్మధ్రువపత్రం జీరాక్స్ లో అతని పేరు లేదని, కాబట్టి ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కాదేమోనని అనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ధనుష్ తమ కొడుకేనంటూ తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వృద్ధ దంపతుల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం కోర్టుకు తెలిపాడు. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.