‘ధర్మశాల విజయాన్ని రిపీట్ చేస్తాం’
మొహాలి: ధర్మశాల విజయాన్ని పునరావృతం చేస్తామని శ్రీలంక కెప్టెన్ తిసారా పెరీరా ధీమా వ్యక్తం చేశాడు. మోహాలిలో ప్రాక్టీస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సిరీస్ గెలవడానికి ఇది ఓ మంచి అవకాశమని, పెద్ద పెద్ద జట్లకు భారత్‌లో సిరీస్ గెలవడం సాధ్యం కాలేదన్నాడు. ధర్మశాల మ్యాచ్ వలె తమ ప్రత్యేకతను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నామన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్న పెరీరా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తామన్న విషయం ప్రతి ఒక్కరికి మెదళ్లలో నాటుకోపోయిందన్నాడు. మ్యాచ్ గెలవడానికి 200 శాతం ప్రదర్శన కనబరుస్తామన్నాడు.
గత న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ కూడా తొలి మ్యాచ్ ఓడిపోయి తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచిందన్న విషయం తెలుసని, అయినా మా బాధ్యత మేం నిర్వర్తిస్తామన్నాడు. 12 ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉందన్న పెరీరా.. ధర్మశాల ప్రదర్శనను కనబరిస్తే సులువుగా మొహాలి మ్యాచ్ గెలువచ్చన్నాడు. ఇక జట్టు సభ్యుల్లో ధనుంజయ డిసిల్వా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని మిగతా వారంతా ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు.
ఇక ధర్మశాలలో రహానేను ఆడించకపోవడంపై స్పందిస్తూ.. నేను భారత సెలక్టర్‌ను కాదు. ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. అతను ఓ గొప్ప బ్యాట్స్‌మన్. ఈ విషయంపై నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేనన్నాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగే మ్యాచ్ భారత్ చావో రేవో అన్నట్లుగా ఉంది.
వాతావారణ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక టీం ధర్మశాలలో ఒక రోజు ఎక్కువగా బసచేసింది. మంగళవారం ఉదయం మొహాలి చేరిన జట్టు మధ్యాహ్నం ప్రాక్టీస్‌లో పాల్గొంది. పెరీరాకు ఈ మైదానంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన అనుభవం ఉంది.