Erra Mallelu: తెలుగుతెరపై అరుణోదయం.. ఎర్ర మల్లెలు
ఎర్ర బావుటాను ఎగరేసిన హిట్ చిత్రాలెన్నో చరిత్రలో ఉన్నాయి కానీ, ట్రెండ్ సెట్టర్ ఏది? ఓ చిన్న విప్లవ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టిస్తుందా? స్టేజ్ సాంగ్స్ సినిమాల్లోనూ సూపర్ హిట్టవుతాయా? వీటన్నిటికీ జవాబు – రెడ్ స్టార్ మాదాల రంగారావు నటించి, ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రమల్లెలు’. ‘నాంపల్లి టేసను కాడి..’, ‘ఓ లగిజిగి లంబాడీ..’, ‘బంగారు మా తల్లీ...’ పాటలు!! 40 ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ వద్ద ‘ఎ ర్రమల్లెలు’ పూచాయి. నేటికీ జనం గుండెల్లో విప్లవ సుగంధాలు వెదజల్లుతూనే ఉన్నాయి.
వెండితెర అలా ఎరుపెక్కింది!
తెలుగు సిన్మాకు 1980 – 81 కాలం ఓ కీలక మైలురాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ (’77)తో మొదలైన పూర్తి కమర్షియల్ ఫార్ములా చిత్రాల హవా సాగుతున్న సందర్భం అది. కానీ, ఆ కాలంలోనే ‘చలిచీమలు’ (’78), తెలంగాణ సాయుధ పోరాటంపై ‘మాభూమి’ (’79), అభ్యుదయచిత్రం ‘యువతరం కదిలింది’ (1980 ఆగస్ట్ 15), ఆ వెంటనే దేశంలోని నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూ బాలచందర్ ‘ఆకలిరాజ్యం’ (1981 జనవరి 9) వచ్చాయి. అన్నీ విజయం సాధించాయి. ‘గరీబీ హఠావో’ అన్నది వట్టి నినాదంగానే మిగిలిపోయి, జనం మనసుల్లో అసంతృప్తి పెరుగుతున్న కాలంలో వచ్చిన జనజీవన పోరాట చిత్రాలివి. లోలోపల కుతకుతలాడుతున్న జనం... వాస్తవ జీవితానికీ, తమలో పేరుకున్న అసంతృప్తికీ తెరపై వ్యక్తీకరణగా ఈ సినిమాలను చూశారు, ఆదరించారు. ఆ నేపథ్యంలో ‘ఎర్రమల్లెలు’ వచ్చింది.
దర్శకుడు ధవళ సత్యం
నిజానికి, తెలుగు తెరపై సినీ పెద్దలెందరో అంతకు ముందూ విప్లవ చైతన్యం కథలో అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. కాకపోతే, కమర్షియల్ షుగర్ కోటింగ్‌లో చూపారు. అవేవీ నేరుగా ఎర్ర జెండాను ఎత్తిపట్టుకున్నవి కావు! కమ్యూనిస్టు పార్టీ చిహ్నాలతో మే డే పాటలు పెట్టినవీ కావు!! కానీ, ‘ఎర్రమల్లెలు’ నుంచి తెలుగుతెర కమర్షియల్ చట్రంలో ఉంటూనే అరుణారుణమయ్యే నేర్పు నేర్చింది. జనమూ లాల్‌సలామ్ కొట్టారు.
విప్లవ పంథాకు ట్రేడ్ మార్క్‌గా... మాదాల
తెలుగులో రెడ్ సినిమాల ట్రెండ్ సెట్టర్ అంటే కచ్చితంగా నటుడు, నిర్మాత మాదాల రంగారావే! ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే! ‘‘...నా ఆశకు ఆశయం తోడై, జనాశయం చేయూతై వెండితెరను ఎరుపెక్కించాను. ఎరుపు విప్లవానికి చిహ్నం. సమసమాజమే విప్లవ లక్ష్యం. ఆ విప్లవమే నా ఊపిరిగా, నాలో ఊపిరున్నంత వరకు నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను...’’ అంటూ ‘ఎర్రమల్లెలు’ రిలీజు టైములోనే స్పష్టంగా ప్రకటించారు మాదాల. సమస్యలు, సెన్సార్ యుద్ధాలు ఎన్ని ఎదురైనా, మాదాల జీవితాంతం విప్లవభావాలకే కట్టుబడడం విశేషం. దటీజ్ కామ్రేడ్ మాదాల!
‘యువతరం’తో... కదలిక
నిర్మాతగా మాదాల చేసిన తొలి ప్రయత్నం – ‘యువతరం కదిలింది’. కాలేజీ వాతావరణం, అందులోనే గ్రామీణ సమస్యలు, యువతరం ఆలోచనల్లో రావాల్సిన మార్పులు – ఇలా అనేక అంశాలను చర్చించిందీ సినిమా. మాదాల, రామకృష్ణ, సాయిచంద్, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఆ అభ్యుదయ చిత్రం సంచలన విజయం సాధించింది. 3 నందులు గెల్చింది.
వామపక్షవాది – ప్రజానాట్యమండలిలో మాదాల మిత్రుడు ధవళ సత్యం అప్పటికే ‘జాతర’తో దర్శకుడై, మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రెండో సినిమాతో హిట్ సినిమా దర్శకుడనిపించుకున్నారు. దర్శకుడిగా ఆయనకు మూడో సినిమా ‘ఎర్రమల్లెలు’. నిజానికి, ‘యువతరం కదిలింది’ రిలీజై, సక్సెసయ్యాక ధవళ సత్యం, మాదాల రాజమండ్రిలో ఓ కమ్యూనిస్టు పార్టీ సభకు హాజరయ్యారు. ‘‘అక్కడే జనం మధ్య మాదాల ఉత్సాహంగా ‘ఎర్రమల్లెలు’ ప్రకటించారు. మద్రాసుకు తిరుగు ప్రయాణంలోని డిస్కషన్లలో మాదాల కథకు హంగులద్దా’’రు సత్యం.
కార్మిక – కర్షక సమస్యల కథతో...
తెల్లగా, స్వచ్ఛంగా ఉండే మల్లెలకు విప్లవ సూచకంగా ఎర్రదనమనే మాటను కలిపి, విరోధాభాసగా మార్చి, ‘ఎర్రమల్లెలు’ అనే వినూత్నమైన పేరు పెట్టడం ఓ ప్రయోగం. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం. ఊళ్ళోని చదువురాని జనాన్ని పావులు చేసి ఆడుకొనే ముగ్గురు దుష్టులు. ఆ ఊళ్ళో చదువు చెప్పడానికి ఓ మాస్టారు వస్తారు. ఆయన వల్ల జనంలో చైతన్యం రగిలి, ఆ ముగ్గురు దుష్టులకు తోడున్న పక్క ఊరి ఫ్యాక్టరీ ఓనర్ కూడా ప్రజా విప్లవ జ్వాలల్లో భగ్గుమనడం ఈ చిత్రకథ.
ఏకకాలంలో అటు గ్రామీణ సమస్యల్ని, ఇటు కార్మిక సమస్యల్ని చూపిన సినిమా ఇది. దెబ్బకు దెబ్బే మార్గమనే ఉగ్రవాది రంగా (మాదాల), ఆవేశంతో పాటు ఆలోచన కావాలనే కార్మిక నేత సూరి (మురళీమోహన్), మాస్టారు (నల్లూరి) లాంటి మంచి పాత్రలు, కొన్ని దుష్టపాత్రల మధ్య ఆలోచింపజేసేలా కథ సాగుతుంది. సిన్మాలాగా కాక ఒక ఉద్యమంలా, ఎక్కడో చూసినట్టుగా – వాస్తవంగా జరుగుతున్నట్టు అనిపించే పద్ధతిలో ఒంగోలు, టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ధవళ సత్యం దీన్ని తీశారు. అదే ‘ఎర్రమల్లెలు’కు బలం. నరసాపురం నాటక రచయిత, ప్రజానాట్యమండలి ఎమ్జీ రామారావు రాసిన డైలాగ్స్ ప్లస్సయ్యాయి.
ప్రజాగీతాలకు పట్టం
సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభంజనం నడుస్తున్న రోజులవి. 1981లో వచ్చిన తెలుగు చిత్రాల్లో మూడొం తులుకు ఆయనదే మ్యూజిక్. ఆ కమర్షియల్ కింగ్ ఈ విప్లవాత్మక ‘ఎర్రమల్లెలు’కు సంగీతం అందించడం ఓ విచిత్రం. ‘ఎర్రమల్లెలు’ పాటలు ఆ రోజుల్లో వీధి వీధినా మారుమోగాయి. ఎర్రజెండాలు, సుత్తి – కొడవలి చిహ్నాలతో కార్మిక దినోత్సవ గీతం ‘అన్యాయం అక్రమాలు..’ (రచన అదృష్టదీపక్) కార్మిక సంఘాలకు కొత్త ఉత్సాహమిచ్చింది.
ఇప్పటికీ మే డే అంటే ఆ పాట తెలుగునాట ఊరూవాడా మోగుతుంటుంది. ‘ఓ లగిజిగి లంబాడీ...’, ‘బంగారు మా తల్లీ...’ పెద్ద హిట్టయ్యాయి. ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రదర్శనలిచ్చిన రోజుల్లో ధవళ సత్యం రాసి, స్టేజీ పాడిన పాపులర్ గీతాలివి. మరో ప్రజానాట్యమండలి బిడ్డ ప్రభు రాసి, వేదికపై పాడే ‘నాంపల్లి...’ కూడా తెరకెక్కింది. సినీరంగానికొచ్చాక ధవళ సత్యం ఈ ‘నాంపల్లి..’, ‘బంగారు మాతల్లి...’ పాటల్ని సినిమాల్లో పెట్టుకోమని ఎందరినో అడిగారు. చివరకు తానే దర్శకుడయ్యాక వాడారు.
మహామహులకు తెరంగేట్రం
జంధ్యాల చిత్రాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న సుత్తి వీరభద్రరావుకూ, సీరియల్స్‌లో నేటికీ అలరిస్తున్న నటి శివపార్వతికీ ‘ఎర్రమల్లె’లే తెరంగేట్రం. ‘ఇదే అమెరికాలో అయితే...’ అనే లాయర్ పాత్ర వీరభద్రరావుకు మంచి పేరు తెచ్చింది. తర్వాతి కాలంలో దర్శకుడైన మాదాల మిత్రుడు టి. కృష్ణ తెరపై తొలిసారి కనిపించిందీ ‘ఎర్రమల్లె’లే. సినిమాలో పూర్తి నిడివి ఉండే పాలేరు పాత్ర కోసం కృష్ణ గడ్డం పెంచారు. గడ్డం గెటప్ బాగుందని అందరూ అనడంతో జీవితాంతం కంటిన్యూ చేశారు.
సినీ విప్లవంలో... బాటసారులు
‘ఎర్రమల్లెలు’ వేసిన వెండితెర విప్లవమార్గం ఆ తర్వాత ఎందరెందరికో ఆదర్శమైంది. చివరకు హీరో కృష్ణ, మోహన్ బాబు, దర్శకుడు దాసరి లాంటి స్టార్లు కూడా ‘ఎన్కౌంటర్’, ‘అడవిలో అన్న’, ‘ఒసేయ్ రాములమ్మ’ (1997)తో ఈ దోవలోకి వచ్చి, సినిమాలు తీశారు. దాన్నిబట్టి ఇదెంత పెద్ద కమర్షియల్ ఫార్ములాగా వెలిగిందో అర్థం చేసుకోవచ్చు. మాదాల రెడ్ ఫిల్మ్స్ దశాబ్దం సాగితే, ఆయన మిత్రుడు టి.కృష్ణ లేడీ ఓరియంటేషన్తో మరింత ఎఫెక్టివ్‌గా ఇదే భావజాలం తెరపై చూపారు. దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ ‘మరోమలుపు’ (’82) వగైరాతో వచ్చారు. పూర్తి ఎర్ర సిన్మాలు కాకున్నా, సామాజిక సమస్యలతో చర్చ రేపారు.
ఈ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986)తో మొదలెట్టి ‘ఎర్రసైన్యం’ (1994)తో ఆర్. నారాయణమూర్తి ఏకంగా ‘పీపుల్స్ స్టార్’ అయ్యారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అదే జెండా, ఎజెండాలను భుజానికెత్తుకొని, ఒంటరి పోరాటం చేస్తున్నారు. మిగతావారంతా ఆర్థిక ఆకర్షణతో అతిథులుగా వచ్చిపోయారు కానీ, అప్పుడు మాదాల – ఇప్పుడు నారాయణమూర్తి మాత్రం నిబద్ధతతో సమస్యాత్మక, విప్లవ పంథా చిత్రాలే తీయడం విశేషం. వీటన్నిటికీ ఊపునిచ్చింది కాబట్టే, ‘ఎర్రమల్లెలు’ ఇవాళ్టికీ ఓ చరిత్ర. మాదాల – ధవళ సత్యం బృందం అన్నట్టు, సమాజంలో ‘‘ఈ దోపిడీలు, ఈ దురంతాలు ఉన్నంతకాలం – ప్రతి మల్లియ మనసు ఎరుపెక్కుతుంది. ప్రతి రోజూ ఒక మేడే అవుతుంది!’’
రేపుల ఇమేజ్ నుంచి రెడ్ స్టార్‌గా..
ఒంగోలు దగ్గర భూస్వామ్య కుటుంబంలో పుట్టి, డాక్టర్ అవమంటే యాక్టరైన వ్యక్తి మాదాల రంగారావు. ఎన్జీ రంగాను ఇష్టపడే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుల వైపు, కళల వైపు మొగ్గారాయన. గుంటూరు హిందూ కాలేజీ, ఒంగోలు సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంఘాలు, ప్రజానాట్యమండలి బృందాలతో దోస్తీ కట్టారు. ‘నల్లూరి అన్న’ శిక్షణలో రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివి, సినిమాల్లోకి వెళ్ళారు. ‘చైర్మన్ చలమయ్య’, ‘ఆడంబరాలు– అనుబంధాలు’ (1974), ‘బాబు’, ‘తీర్పు’ – ఇలా అనేక చిత్రాల్లో వేషాలు వేశారు.
‘ఎర్రమల్లెలు’లో... మాదాల
ఎదురుదెబ్బలు తిన్నారు. నమ్మిన వామపక్ష భావాల్ని ప్రచారం చేస్తూ, తానే హీరోగా సినిమాలెందుకు నిర్మించకూడదని నిర్మాతయ్యారు. అలా తెలుగు సినిమాను అరుణ మార్గం పట్టించారు. ఆవేశం తెప్పించారు. అప్పట్లో ‘బంగారు చెల్లెలు’ (1979)లో శ్రీదేవిని రేప్ చేసే పాత్ర సహా, తెరపై పలుమార్లు రేపిస్టు పాత్రలేయడంతో కొందరు మాదాలను ‘రేపులరంగారావు’ అని గేలిచేశారు. కానీ అదే మాదాల వరుస విప్లవచిత్రాలతో విజయాలం దుకున్నాక ఆ ఇమేజే మారిపోయింది. ‘రేపుల రంగారావు’ అని వెక్కిరించిన నోళ్ళే ‘రెడ్ స్టార్’ అని ఆకాశానికెత్తాయి.
బాక్సాఫీస్ మల్లెలు
నిజాయతీ, నిబద్ధతతో తీసిన ‘ఎర్రమల్లెలు’కు జనం నీరాజనం పట్టారు. 23 కేంద్రాల్లో రిలీజై, 17 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం చేసుకుంది. ఆ జోరు కొనసాగి, విజయవాడ (రామా టాకీస్), గుంటూరు (శ్రీలక్ష్మీ), తిరుపతి (జయశ్యామ్) సహా ఏడెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గత నలభై ఏళ్ళుగా తెలుగులో వస్తున్న రెడ్ ఫిల్మ్స్‌కు ట్రెండ్ సెట్టరైంది. తెలుగులో రిలీజైన వెంటనే ఈ చిత్రం తమిళంలోకి ‘సివప్పు మల్లి’ (1981 ఆగస్ట్ 15)గా రీమేకైంది.
సంసారపక్ష సినిమాలు తీసే ప్రసిద్ధ ఏ.వి.ఎం. సంస్థ దీన్ని నిర్మించడం మరీ విశేషం. తిరుపతిలో సినిమా చూసిన తమిళ దర్శక, నిర్మాతలు రీమేక్‌లో కూడా మాదాలతోనే నటింపజేయాలనుకున్నారట. అయితే, అప్పటికే తదుపరి చిత్రం ‘విప్లవశంఖం’ (1982 ఏప్రిల్ 9)తో బిజీగా ఉన్న మాదాల చేయలేనన్నారట. చివరకు తమిళంలో హీరో విజయకాంత్, ముచ్చర్ల అరుణ నటించారు. తర్వాతి కాలంలో భక్తి చిత్రాలు తీసిన శతాధిక సినిమాల రామనారాయణన్ ఈ తమిళ విప్లవ రీమేక్‌కు దర్శకుడు! తమిళ రీమేక్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.
అభ్యుదయంలో... ఆత్మీయ మిత్రులు
ఒంగోలులో రెండున్నర దశాబ్దాలు నడిచిన ‘స్టూడెంట్స్ ఫెడరేషన్’ (ఎస్.ఎఫ్) మెస్, విద్యార్థి సంఘం ఏ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకలాపాలు, ‘ప్రజానాట్యమండలి’ నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మార్గదర్శనం... ఇవన్నీ ఎందరికో అభ్యుదయ పాఠశాల. మాదాల, దర్శకుడు టి. కృష్ణ (నేటి హీరో గోపీచంద్ తండ్రి) నుంచి ‘వందేమాతరం’ శ్రీనివాస్ దాకా ఎంతోమంది అక్కడ తయారైనవాళ్ళే! ‘‘కళ కళ కోసం కాదు... ప్రజల కోసం’’ అని నమ్మినవాళ్ళే! ఆచరించినవాళ్ళే!! కాలేజీ నుంచి మాదాల – టి. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్. నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది కృష్ణే! మధ్యలో కొంతకాలం కృష్ణ వెనక్కి వచ్చేసి, ఒంగోలు పొగాకు వ్యాపారం చేసుకున్నారు.
నల్లూరి, కె. రాధాకృష్ణ, ..., యు.విశ్వేశ్వరరావు, మాదాల, ..., ..., టి. కృష్ణ
మాదాల మద్రాసులోనే చావో రేవో అని కూర్చున్నారు. మాదాల నిర్మాత అయినప్పడు మద్రాసు వచ్చి తొలి (‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’) చిత్రాలకు సాయంగా నిలిచిందీ కృష్ణే. తర్వాతి కాలంలో స్క్రిప్టులో మార్పులపై మాట వినని మాదాలతో విభేదించి, కృష్ణ తానే దర్శకుడయ్యారు. ఆత్మీయ ‘రంగన్న’కు దీటుగా ఎదిగారు. మాదాల ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం– మనం’, ‘ఎర్రమట్టి’ – ఇలా 7 చిత్రాలు నిర్మించారు. 36 ఏళ్ళే జీవించిన టి.కృష్ణ దర్శకుడిగా తీసినవీ ఏడే ఫిల్మ్స్. కలసి ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు మిత్రుల జీవితంలో గమ్మతై ్తన పోలిక ఇది.
ఆ పాట... శైలజకు టర్నింగ్ పాయింట్!
అప్పుడప్పుడే గాయనిగా పైకి వస్తున్న ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజకు ఈ ‘ఎర్రమల్లెలు’ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో ఆమె పాడిన ‘నాంపల్లి టేసను కాడి..’ మోత మోగిపోయింది. ఆమె కెరీర్‌కు ఈ పాట పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎన్నో ప్రైవేట్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఎక్కడ సంగీత విభావరి జరిగినా, ఆమె ఈ పాట పాడాల్సిందే! ఈ పాటకు మాదాల కుమారుడు – నేటి నటుడు డాక్టర్ మాదాల రవి నటించడం విశేషం. బాలనటుడిగా అదే అతనికి తెరంగేట్రం. ఆపై ‘స్వరాజ్యం’(1983)లో ఫుల్ లెన్త్ రోల్లో రవి నటించారు. ‘‘నటనలోకి వస్తానని అనుకోలేదు. ‘ఎర్రమల్లెలు’ టైమ్‌కి ఏడో తరగతి చదువుతున్నా.
రికార్డయిన పాటల్ని ఇంట్లో పదే పదే వింటూ, ఓ రోజు ‘నాంపల్లి...’ పాటకు హుషారుగా డ్యా¯Œ ్స చేస్తున్నా. నాన్న గారు అది చూసి, ఆ పాట నా మీదే తీశారు. డ్యా¯Œ ్స మాస్టర్ కూడా లేని ఈ పాటను ఒకే రోజున ఉదయం 8కి మొదలుపెట్టి సాయంత్రం 4 కల్లా చిత్రీకరించారు’’ అని రవి చెప్పారు. ఒంగోలులో రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ పాట తీశారు. ఆ పాట చిత్రీకరణలో ధవళ సత్యం వెంట టి. కృష్ణ, బి. గోపాల్ లాంటి నేటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆ పాట ఎంత ట్రెండ్సెట్టరంటే– తర్వాత వచ్చిన అభ్యుదయ, విప్లవ సిన్మాలన్నిట్లో ఇలాంటి సోషియో – పొలిటికల్ సెటైర్ సాంగ్స్ వచ్చాయి. ‘నేటిభారతం’(1983)లోని ‘అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు...’,
‘రేపటి పౌరులు’(1986)లోని ‘అయ్యా నే సదివి బాగుపడతా..’ లాంటి పాటలే అందుకు సాక్ష్యం!
– రెంటాల జయదేవ