
జయప్రకాష్ రెడ్డి
విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తెలుగు చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి ఏకపాత్రాభినయం చేసి, నిర్మించిన సినిమా ‘అలెగ్జాండర్’. ధవళ సత్యం దర్శకుడు. జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా నాకు నాటకాలంటే ప్రాణం. అదే నన్ను సినిమా నటుణ్ణి చేసింది. వన్ మ్యాన్ షో చేద్దామని రచయిత పూసలకు చెబితే ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. వంద నిమిషాల నిడివితో ఉండే కథతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 ప్రదర్శనలు ఇచ్చాను.
ఆ కథనే సినిమాగా తీద్దామని ధవళ సత్యం దర్శకత్వంలో నటించాను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది ప్రేక్షకులకు చేరువకావడం కష్టం. ఆ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సినిమాను ఎవరైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారేమోనని చూస్తున్నాం. రిటైర్డ్ మేజర్ ఒక హెల్ప్‌లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథలో కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి ఒక్కడే పాత్రధారి కావడం విశేషం. అయితే వెనక నుంచి వచ్చే కొందరు నటుల మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి’’ అన్నారు ధవళ సత్యం.