తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకి లభ్యం
తమిళనాడులో పోలీసులకు లొంగిపోయిన కిడ్నాపర్ దంపతులు
తిరుపతి క్రైం: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం వద్ద ఇటీవల కిడ్నాప్‌కు గురైన తొమ్మిది నెలల బాలుడు చెన్నకేశవుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దంపతులు తమిళ నాడులోని వేలకుర్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు శుక్రవారం తిరుపతిలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం సాయిపురానికి చెందిన చెన్నకేశవుడును ఈ నెల 14న తిరుమలలో గుర్తుతెలియని దంపతులు కిడ్నాప్ చేయడం తెలిసిందే. బాలుడి ఆచూకీకోసం పోలీసులు 23 బృందాల్ని ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో జల్లెడ పట్టారు.
వివిధ మార్గాల్లో పోలీసులు నిందితుల కోసం గాలించగా ఒత్తిడికి గురై కిడ్నాపర్లు భయపడి వేలకుర్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారని ప్రభాకర్‌రావు తెలిపారు. వారిని తమిళనాడులోని నమ్మకల్ జిల్లాలోని శింగనందాపురం వాసులైన అశోక్, తంగవి దంపతులుగా గుర్తించినట్టు తెలిపారు. తిరుమలలో చెన్నకేశవుడి తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉండగా అశోక్, తంగవి దంపతులు పిల్లాడ్ని కిడ్నాప్ చేశారని, తర్వాత నేరుగా ఆర్టీసీ బస్సులో తమిళనాడు వెళ్లారని వివరించారు. ఇదిలా ఉండగా అశోక్‌కు ఇద్దరు భార్యలని, వారిద్దరికీ ఆడపిల్లలే పుట్టడంతో మగపిల్లాడి కోసమే రెండో భార్య తంగవితో కలసి చెన్నకేశవుడ్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం.