dig ramanakumar
-
కఠినంగా వ్యవహరించండి
- నేరాల నియంత్రణపై డీఐజీ రమణకుమార్ - కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ తనిఖీ కొలిమిగుండ్ల: నేరాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కర్నూలు,కడప రేంజ్ డీఐజీ రమణకుమార్ పోలీసులకు సూచించారు. విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. శనివారం ఆయన కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డు, కంప్యూటర్ గదులు, నేరస్తులను ఉంచే సెల్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసుల నమోదుపై ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్యతో చర్చించారు. మూడు జిల్లాలకు సరిహద్దున ఉన్న కొలిమిగుండ్ల స్టేషన్‌కు రెండేళ్లుగా వాహన సౌకర్యం లేదనే విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే కొత్త వాహనాలు వస్తాయని చెప్పారు. పోలీస్ క్వార్టర్స్, 1907లో నిర్మించిన పాత పోలీస్ స్టేషన్ భవనం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్కు పరిశీలన.. పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును డీఐజీ పరిశీలించారు. పార్కు అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. స్టేషన్లలో ఎక్కడా లేని విధంగా రూపొందించిన పార్కు విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. డీఐజీని కలసిన ఎమ్మెల్యే.. డీఐజీ రమణకుమార్ కొలిమిగుండ్లకు వచ్చినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి స్టేషన్‌కు వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యలపై ఇతర నియోజక వర్గాల్లో ఉన్న ముగ్గురు డీఎస్పీలను ఆశ్రయించాల్సి వస్తోందని ఎమ్మెల్యే డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై డీఐజీ మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రత్యేకంగా డీఎస్పీని నియామకానికి కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. మూడు జిల్లాల సరిహద్దున ఉన్న కొలిమిగుండ్ల స్టేషన్‌ను సర్కిల్ కార్యాలయంగా మార్చే ప్రతిపాదన గతంలోనే ఉందని ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
ఇద్దరు పోలీసు అధికారుల సస్పెన్షన్
కడప అర్బన్ : జిల్లా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న ఇరువురు పోలీసు అధికారులను సస్పెన్షన్ చేస్తూ కడప, కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఓ విభాగంలో విధులు నిర్వర్తించే సమయంలో దొంగ డీజిల్ బిల్లు, వాహనాల రిపేర్లకు సంబంధించి అధిక మొత్తంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆర్ఎస్ఐ పోతురాజుతోపాటు ఎ.వేణుగోపాల్ (ఏఆర్ పీసీ 2373)ను సస్పెన్షన్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వేకోడూరు ఎస్ఐ రమేష్‌బాబు సస్పెన్షన్ వరకట్న వేధింపు కేసులో సరిగా దర్యాప్తు చేయలేదని, సివిల్ పంచాయతీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైల్వేకోడూరు ఎస్ఐ డి.రమేష్‌బాబుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
దేశాన్ని అగ్రగామిగా నిలపాలి
కడప కల్చరల్ : భారత దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలుపాలని కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రిమ్స్ వద్దగల శ్రీ రామకృష్ణ మిషన్‌లో సిస్టర్ నివేదిక 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొనెలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, సృజనాత్మకత కలిసిన విద్య ఉత్తమమైనదన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి , సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే వారిలోని సజనాత్మకశక్తిని పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు. విశిష్ఠ అతిథిగా హాజరైన విశాఖపట్టణం రామకృష్ణమఠం ప్రతినిధి స్వామి గణేషానందజీ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు విద్యార్థులను సంస్కృతి సంప్రదాయాల రక్షకులుగా మార్చాలని, వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గౌరవ అతిథి డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ విద్యార్థులే తమ ఆస్తి అని గర్వంగా చాటుకునే స్థితిని ఉపాధ్యాయులు సాధించాలన్నారు. స్వామి అచింత్యానంద పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. శని, ఆది వారాల్లో కూడా ఈ శిబిరం కొనసాగనుంది.