దేశాన్ని అగ్రగామిగా నిలపాలి
కడప కల్చరల్ :
భారత దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలుపాలని కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రిమ్స్ వద్దగల శ్రీ రామకృష్ణ మిషన్‌లో సిస్టర్ నివేదిక 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొనెలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, సృజనాత్మకత కలిసిన విద్య ఉత్తమమైనదన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి , సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే వారిలోని సజనాత్మకశక్తిని పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు. విశిష్ఠ అతిథిగా హాజరైన విశాఖపట్టణం రామకృష్ణమఠం ప్రతినిధి స్వామి గణేషానందజీ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు విద్యార్థులను సంస్కృతి సంప్రదాయాల రక్షకులుగా మార్చాలని, వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గౌరవ అతిథి డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ విద్యార్థులే తమ ఆస్తి అని గర్వంగా చాటుకునే స్థితిని ఉపాధ్యాయులు సాధించాలన్నారు. స్వామి అచింత్యానంద పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. శని, ఆది వారాల్లో కూడా ఈ శిబిరం కొనసాగనుంది.