సర్కారు బడికి కార్పొరేట్ సొబగులు
మేడ్చల్, న్యూస్‌లైన్:
పాలకులు చిత్తశుద్ధితో పని చే స్తే ఏదైనా సాధ్యమే అనడానికి ఆ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అనుకున్నదే తడవుగా తన అభీష్టాన్ని నెరవేర్చుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా మేడ్చల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కార్పొరేట్ పాఠశాల దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన సేవా సంస్థలు లీడ్ఇండియా, కేఎల్లార్ ట్రస్టు ద్వారా మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అనధికారికంగా దత్తత తీసుకున్నారు. నెల రోజుల క్రితం పాఠశాలలో నిర్వహించిన జోనల్ క్రీడల ప్రాంభోత్సవానికి పాఠశాలకు వెళ్లిన ఆయన పాఠశాల పరిస్థితులను గమనించారు.
పాఠశాలను తాను దత్తత తీసుకుని జిల్లాలో మోడల్ పాఠశాలగా మారుస్తానని నాటి సభలో ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఆయన మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల ఆవరణ శుభ్రంగా చదును చేయించి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఇందుకుగాను నిధులను తమ సేవా సంస్థల నుంచి వెచ్చిస్తున్నారు. పాఠశాల ఆవరణను అందమైన ఆటస్థలంగా మార్చారు. ఆటస్థలంలో అన్ని రకాల ఆటల ప్రాక్టీస్ కోసం సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, క్రికెట్ వంటి క్రీడల ప్రాక్టీస్‌కు ఆటస్థంలో అన్ని రకాల సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారు.
డీజీ క్లాసులు
కార్పొరేట్ పాఠశాల్లో ఉండే డీజీ క్లాసులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భవనానికి పూర్తిగా రంగులు వేసి భవనంపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు లీడ్ఇండియా పేరు రాశారు. ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డికి మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు ఉండటంతో ఆయనతో పాటు ఇద్దరు టీచర్లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా ఎమ్మెల్యే సంస్థ లీడ్ఇండియా శిక్షకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
కేఎల్లార్ ప్రత్యేక శ్రద్ధ
మోడల్ స్కూల్‌గా మేడ్చల్ జిల్లా పరిషత్ పాఠశాలను తీర్చిదిద్దుతానని ప్రకటించిన ఎమ్మెల్యే తన హామీని నెరవేర్చెందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మేడ్చల్‌లోనే నివాసముంటున్న ఆయన ప్రతి రోజు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉపాధ్యాయులను, విద్యార్థులను ఉత్తేజపరుస్తున్నారు.