digiinvestment
-
Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. పీఎస్ఈ పాలసీ ప్రకారం అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్‌గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్‌పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
వచ్చే ఏడాదిలో మరింత స్పీడ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లలో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని చేపట్టనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలుత పెట్టుకున్న లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లతో పోలిస్తే తాజా టార్గెట్‌లో భారీగా కోత పడింది. సవరించిన తాజా అంచనాల ప్రకారం మార్చితో ముగియనున్న ఈ ఏడాది రూ. 78,000 కోట్లు సమీకరించగలమని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కాగా.. వచ్చే ఏడాది ఈసీజీసీసహా మూడు పీఎస్‌యూల పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నట్లు పాండే తెలియజేశారు. మైనారిటీ వాటాలు వచ్చే ఏడాది లక్ష్యాలను చేరేందుకు కొన్ని సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాలను సైతం విక్రయించనున్నట్లు పాండే వెల్లడించారు. పవన్ హంస్ కొనుగోలుకి పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్.. ఫైనాన్షియల్ బిడ్స్ దశకు చేరినట్లు తెలియజేశారు. -
డిజిన్వెస్ట్మెంట్కు ఎల్ఐసీ దన్ను
న్యూఢిల్లీ: గతేడాది ప్రభుత్వం చేపట్టిన డిజిన్వెస్ట్మెంట్లో... బీమా దిగ్గజం ఎల్ఐసీ మొత్తం రూ. 16,400 కోట్ల విలువైన పీఎస్‌యూ షేర్లను కొనుగోలు చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో ప్రధాన కొనుగోలుదారుగా నిలుస్తూ వచ్చింది. తద్వారా ప్రభుత్వం సమీకరించిన నిధులలో 49% మొత్తాన్ని సమకూర్చడం గమనార్హం. 2012 మార్చి తరువాత మొత్తం 11 కంపెనీలలో చేపట్టిన ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం రూ. 33,800 కోట్లను సమకూర్చుకుంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వంఓఎన్జీసీలో 42.78 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా ఎల్ఐసీ 40 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 12,179 కోట్లను వెచ్చించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఎన్టీపీసీ ఇష్యూలో 12 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. వీటితోపాటు సెయిల్, నాల్కో, ఎంఎంటీసీ, హిందుస్తాన్ కాపర్, ఆర్సీఎఫ్, ఎస్టీసీ, ఐటీడీసీ ఇష్యూల్లో సైతం ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసింది.