న్యూఢిల్లీ: గతేడాది ప్రభుత్వం చేపట్టిన డిజిన్వెస్ట్‌మెంట్‌లో... బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మొత్తం రూ. 16,400 కోట్ల విలువైన పీఎస్‌యూ షేర్లను కొనుగోలు చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)లో ప్రధాన కొనుగోలుదారుగా నిలుస్తూ వచ్చింది. తద్వారా ప్రభుత్వం సమీకరించిన నిధులలో 49% మొత్తాన్ని సమకూర్చడం గమనార్హం. 2012 మార్చి తరువాత మొత్తం 11 కంపెనీలలో చేపట్టిన ఓఎఫ్‌ఎస్ ద్వారా ప్రభుత్వం రూ. 33,800 కోట్లను సమకూర్చుకుంది.
డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వంఓఎన్‌జీసీలో 42.78 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా ఎల్‌ఐసీ 40 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 12,179 కోట్లను వెచ్చించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఎన్‌టీపీసీ ఇష్యూలో 12 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. వీటితోపాటు సెయిల్, నాల్కో, ఎంఎంటీసీ, హిందుస్తాన్ కాపర్, ఆర్‌సీఎఫ్, ఎస్‌టీసీ, ఐటీడీసీ ఇష్యూల్లో సైతం ఎల్‌ఐసీ షేర్లను కొనుగోలు చేసింది.