రేపటి కోసం నిరీక్షణకు చెల్లు
పంపిన రోజే పార్శిల్ ఇంటికి..
పోస్టల్ శాఖ సరికొత్త సేవలు ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో పార్శిల్ సేవలు మరింత వేగవంతమైంది. పార్శిల్ పంపించిన రోజే డెలివరీ అయ్యే సరికొత్త సేవలను పోస్టల్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. పోస్టల్ సర్వీసెస్ బోర్డు సభ్యుడు జీ. జాన్ సామ్యూల్ సేమ్‌డే పార్సిల్ డెలవరీ వ్యాన్లను చిక్కడపల్లి కమ్యూనిటీ హాల్‌వద్ద బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ పరిధిలో..
ప్రస్తుతం సేమ్‌డే పార్శిల్ డెలవరీ సేవలను హైదరాబాద్ జీపీవో, హుమాయూన్‌నగర్, హిమాయత్ నగర్, మలక్‌పేట, సరూర్‌నగర్, మల్కాజిగిరి, హిమ్మత్ నగర్ పోస్టల్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సేవలు అందుబాటులో గల లోకల్ పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా పార్శిళ్లను పంపవచ్చు. అదేరోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సంబంధిత చిరునామాలకు సిబ్బంది డెలివరీ చేస్తారు. పార్శిల్ బరువు 500 గ్రాములకు సర్వీస్ చార్జీ రూ.19, పోస్టల్ రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 17. మొత్తం రూ. 36. ఈ సేవలపై టోల్ ఫ్రీ నంబర్ 1800 925 3925.
మెరుగైన పోస్టల్ సేవలు...
సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్ సేవలు అందించేందుకు దేశంలోని మరో నాలుగు మహానగరాల్లో ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు జాన్ సామ్యూల్ వెల్లడించారు. సేమ్‌డే పార్శిల్ డెలవరీ సేవలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఢిల్లీ, కలకత్తాలో ఆటోమెటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చామని, త్వరలో హైదరాబాద్ తోపాటు, చెన్నై, బెంగళూర్, ముంబయి మహానగరాల్లో కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
త్వరలో డిజిటల్ పోస్టాఫీసు...
సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో డిజిటల్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ-కామర్స్ సేవలను విస్తృతపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, హైదరాబాద్ ప్రాంతీయ పోస్టల్ జనరల్ ఎం ఎలిషా, పోస్టల్ సర్వీసెస్ డెరైక్టర్ మరియమ్మ థామస్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ సూరింటెండెంట్ శిల్పారావు తదితరులు పాల్గొన్నారు.