Dignity Murder
-
పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి
వేంపల్లె: పరువు కోసం ఓ తండ్రి తన కుమార్తెను కడతేర్చాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం మేరకు..పోరుమామిళ్ల వనజారాణి (29)కి గురువేంద్రతో 2009లో వివాహమైంది. వీరి కుమార్తె గురు పూజిత మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన క్రమంలో వనజారాణి తన తల్లిదండ్రుల వద్ద ప్రొద్దుటూరులో ఉంటూ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ నుంచి ఆమె భర్త వేంపల్లెకు వచ్చాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తతో తనకు విడాకులు ఇవ్వాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై వారం రోజుల నుంచి భర్తతో ఆమె గొడవపడుతోంది. విషయాన్ని వనజారాణి తల్లిదండ్రులకు గురువేంద్ర చెప్పి ఆమెకు నచ్చజెప్పాలని వారిని కోరాడు. వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్థన్, మరొకరు శనివారం రాత్రి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె వినిపించుకోలేదు. దీంతో చున్నీని మెడకు చుట్టి ఆమెను హత్య చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తండ్రి, చిన్నాన్న, మరొకరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. -
ప్రేమను అర్థం చేసుకోవాలి
‘‘రాయలసీమలో జరిగిన ఒక వాస్తవ పరువు హత్య నేపథ్యంలో ‘బంగారి బాలరాజు’ ఉంటుంది. ఈ మధ్య పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. అయితే.. ప్రేమలో ఉండే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి’’ అని రాఘవ్ అన్నారు. ఆయన హీరోగా, కరోణ్య కత్రిన్ హీరోయిన్గా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణవ్ పరువు హత్య అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి హత్యలకు సరైన రీతిలో ముగింపు మా సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. ఇటు ప్రేమికులు.. అటు తల్లిదండ్రుల సమస్యలను చర్చించాం. నిర్మాతల్లో ఒకరైన రెడ్డం రాఘవేంద్రరెడ్డి గారి కొడుకుని నేను. రఫీ, కోటేంద్రగార్ల ప్రోత్సాహం మరచిపోలేనిది’’ అన్నారు. -
ప్రణయ్‌ను చంపి.. పెంచుకున్న పరువేంటి?
పరువును చూసుకుని పిల్లలు ప్రేమించరు. ‘పరువు తీసే’ ప్రేమను పెద్దలు క్షమించరు. ప్రేమకు, పరువుకు మధ్య తీరని ఘర్షణ ఇది! తరతరాల సంఘర్షణ ఇది. పెద్దలూ ఒకప్పటి పిల్లలే కదా. ఈ నిజాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. ప్రేమ నేరం అవదు. పరువు గుర్తుకే రాదు. ‘‘అమృత వర్షిణి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ అమ్మాయి బాధ చూడలేకపోతున్నాం! దేవుడా.. ఇంత దారుణమా? కన్నబిడ్డల సంతోషం, సుఖం కంటే కావల్సిందేముంది? వాళ్లు ఆనందంగా కనపడుతున్నప్పుడు ‘‘కలకాలం ఇలాగే ఉండనీ’’ అని ఆశీర్వదించాలి. అంత పెద్ద మనసు లేకపోతే.. నోటికి అంత మంచి మాట రాకపోతే.. దూరంగా ఉండిపోవాలి. అంతేకాని ఉసురు తీస్తారా?’’ ఇలాగే బాధపడ్తారు.. ఆలోచిస్తారు స్పందించే గుణమున్న మనుషులైతే! (ప్రణయ్ – అమృత (ఫైల్‌ఫొటో) ) పిల్లలు ఎందుకు బలి కావాలి? అమృత వర్షిణి పెద్ద కులం (?) అమ్మాయి. ప్రణయ్.. తక్కువ కులం (?) అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ఈ అబ్బాయి వాళ్లదీ సౌకర్యవంతమైన జీవనశైలిలో ఉన్న కుటుంబమే. అబ్బాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కెనడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు కూడా. అయితే ఇవేవీ అమ్మాయి తల్లిదండ్రులకు కనిపించలేదు. ‘తక్కువ కులం’ అన్నదొక్కటే భూతద్దంలో కనిపించింది. అదీ పరువు అనే వృత్తంలో తిరుగుతూ! అదే వాళ్ల మెదడులోనూ గింగిరాలు కొట్టింది. అందుకే అదను కాచి కన్న బిడ్డ ఆనందాన్ని మింగేశారు. బిడ్డ భవిష్యత్తును మరిచి.. విచక్షణను కోల్పోయి అనాగరికంగా ప్రవర్తించారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కన్నా సమాజం పెంచిన కులం, పరువే ముఖ్యమని చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుందాం తప్పు ఎవరిదో? అమృత వర్షిణికి కలిగించిన దుఃఖం, బాధ, వేదనలో మన పాలు ఎంత ఉందో? ప్రణయ్‌ను పోగొట్టుకున్న తల్లి శోకానికీ మనమెంత బాధ్యులమో? కులాన్ని సృష్టించి ఆ నియమంలో బతికితేనే పరువు అనే భ్రమకు రూపమిచ్చే పిచ్చి ప్రయత్నం చేస్తూ అదే నిజమని నమ్మే మనుషులతో సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది చిరంజీవిగా వర్థిల్లడానికి పిల్లల్ని బలిపెడుతూ వస్తున్నాం. ఇంకెన్ని? ఇంకెంత కాలం? మొన్ననే.. ఆగస్ట్ 23న అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయలక్ష్మిని సొంత తల్లిదండ్రులే హత్య చేశారు. అమ్మాయికి 27 ఏళ్లు. తాము ఉండే వాడకట్టులోనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. భద్రాచలంలో కాపురం పెట్టారు. సంతోషంగానే ఉంటున్నారు. ఒక బాబు కూడా పుట్టాడు. మూడేళ్లవాడయ్యాడు. ఆ అమ్మాయి మళ్లీ గర్భందాల్చింది. ఏడు నెలలు. ఈలోపు అత్తగారు పోయారని తెలిసి భర్త, పిల్లాడితో కలిసి నాలుగేళ్ల తర్వాత ఆ ఊళ్లోకి అడుగుపెట్టింది. కూతురు వచ్చిన విషయం తెలుసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు ఆమె రాను మొర్రో అని అంటున్నా వినకుండా. తర్వాత ఆ అమ్మాయి అదే ఇంట్లో శవమై కనిపించింది. కూతురి పెళ్లయి నాలుగేళ్లు గడిచినా వాళ్ల కోపం పోలేదు. ఓ బిడ్డను, ఇంకో బిడ్డను కడుపులో మోస్తున్నా ఆ తల్లి మీద దయ రాలేదు. పరువు కోసం కన్న పేగును కోసేసుకున్నారు. 2017లో.. మార్చి నెలలో తెలంగాణ, పెద్దపల్లికి చెందిన మంథని మధుకర్ అనే దళిత యువకుడిని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తరపు బంధువులు అతనిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత అదే యేడు యాదాద్రి జిల్లాకు చెందిన నరేష్, స్వప్నలూ చనిపోయారు. స్వప్న పెద్ద కులస్తురాలు. వాళ్లకన్నా తక్కువ కులానికి చెందిన నరేష్‌ను ప్రేమించి, పెళ్లిచేసుకుందనే కోపంతో స్వప్న తండ్రి ఓ పథకం ప్రకారం ముందు నరేష్‌ను హత్య చేయించాడు. తర్వాత స్వప్న పుట్టింట్లోనే.. బాత్రూమ్లో ఉరేసుకుని శవంగా కనిపించింది. అయితే పెళ్లయ్యాక ఈ జంట షోలాపూర్‌లో కాపురముంటుంటే.. స్వప్నను ముందు ఇంటికి తెచ్చి.. తర్వాత నరేష్‌ను హత్య చేయించారు. పెద్దల పట్టింపు, మూర్ఖపు పట్టుదలలు పిల్లలను హత్యచేశాయి. హత్య చేయడం పరువా?! : సుప్రీం కోర్టు ఇవి యేడాది కిందటివి. అంతకుముందూ హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశానికే పరిమితం అనుకున్న పరువు హత్యలు మనకూ వ్యాపించాయి అంటు వ్యాధిలా. 2014 చివర నుంచి 2017 దాకా అంటే ఆ రెండున్నరేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 పరువు హత్యలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కులాంతర వివాహానికి సంబంధించినవే. 2014– 2015 నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం హానర్ కిల్లింగ్స్‌లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతున్న వీటి సంఖ్యను చూసి అదిరిపడ్డ సుప్రీంకోర్టు 2006లో ‘‘ హత్య చేయడంలో పరువు ఎక్కడుంది? హేయంగా, దారుణంగా, ఘోరంగా, అమానుషంగా చేసే ఈ హత్యల వెనక రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి చర్యలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షకు అర్హులు’’ అంటూ తీర్పునిచ్చింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే అంతటి తీర్పునిచ్చినా భయపడట్లేదు. పరువు హత్యలు ఆగలేదు. అంటే అర్థమైంది కదా.. కులం ఎంత బలమైందో. అది పెంచి పోషిస్తున్న పరువు ఎంతటికి తెగిస్తుందో? లేనిది వచ్చిందా? ఉంటే పెరిగిందా? ఒకమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి మనసులు కలవాలి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా కలిసి బతకగలమనే ధైర్యం ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోగల సత్తా ఉండాలి. వీటిల్లో కులం ప్రాధాన్యం ఎక్కడ ఉంది? దాని ప్రస్తావన ఎందుకు? కాపురానికి కులం అక్కర్లేనప్పుడు దాన్ని అంటుకుని ఉన్న పరువు గురించి ఎందుకు అంత గింజుకులాట? అమృత విషయంలోనే వాళ్ల నాన్న మారుతీరావును తీసుకుంటే.. ప్రణయ్‌ను చంపకముందు వరకు మారుతీరావు ఎవరో మిర్యాలగూడలో కొంతమందికి తప్ప తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర ప్రాంతాల వారికెవరికీ తెలియదు. అమృత, ప్రణయ్‌లు పెళ్లి చేసుకున్నాక కూడా కొంతమంది ఎవరైనా మాట్లాడుకుని ఉంటారేమో కాని అదేమాటతో మొన్నటి వరకూ ఆ ఎవరూ రామకోటి రాసి ఉండరు. ఎవరూ పట్టించుకోని, ఎవరి ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో లేని, నిలబడని మారుతీరావుకు పరువు ఎక్కడినుంచి వచ్చింది? ప్రాణం తీసేంతగా ఎందుకు పగను పెంచింది? ప్రణయ్‌ను చంపి ఆయన పెంచుకున్న పరువేంటి? అసలు కులమంటే ఏంటి? మానవత్వాన్ని మించిందా? అమృత ప్రశ్న కూడా ఇదే! దేశమంతా అభిమానులున్న రజనీకాంత్, జగపతిబాబు, సల్మాన్‌ఖాన్ లాంటి ఎందరో సెలబ్రిటీలే కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా తమ పిల్లలకు వాళ్లు కోరుకున్న వ్యక్తులతో మూడుముళ్లు వేయిస్తుంటే వాడకట్టులో పట్టుమని పదిమందికి తెలియని మనకెందుకు ఇంత పరువు, ప్రతిష్టల పెనుగులాట? పిల్లలనే చంపుకునేంత మూర్ఖపుబాట? పిల్లలకు పెద్దల నుంచి మేమున్నామనే భరోసా కావాలి. భయపడితే వెన్నుతట్టి గుండెల్లో దాచుకోవాల్సినవాళ్లం.. పిల్లలను భయపెట్టి పొట్టలో పొడుస్తున్నాం. రేప్పొద్దున మన పిల్లలు మనల్ని నమ్మకుండా చేసుకుంటున్నాం. పెద్దలూ ఆలోచించండి. – సరస్వతి రమ ఏ తప్పు చేశారనీ... ఈ పిల్లలు ఏ తప్పు చేశారనీ వాళ్లకు ఈ శిక్ష? ‘‘కులమేంటి? మానవత్వం కంటే ఎక్కువా? కులం కోసం మా నాన్న చేసిన పనేంటి?’’ అని ఆమృత ప్రశ్నిస్తోంది. రానురాను కులం, మతం అంతరించాలి కాని ఇప్పుడవే ప్రధానంగా మారుతున్నాయి. ఈ ధోరణి పోవాలి. – భండారు విజయ, ప్రరవే జాతీయ సమన్వయకర్త -
పరువు తీశాడని చంపేశారు!
మెదక్‌రూరల్: పేద, ధనిక తారతమ్యమే ఆ ప్రేమికుడి ప్రాణం తీసింది. సంపన్నుల అమ్మాయిని ప్రాణంగా ప్రేమించడమే అతడు చేసిన తప్పయ్యింది. అమ్మాయిని మరిచిపోయేందుకు డబ్బు ఆశ చూపినా లొంగని ఆ ప్రేమికుడి గుండెను ప్రియురాలి బంధువుల కత్తులు తూట్లు చేశాయి. మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో దారుణ హత్యకు గురైన మోయిన్‌ఖాన్ ఉదంతంలో వారం రోజుల క్రితం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయమై బుధవారం మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ రామకృష్ణ పూర్తి వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మోయిన్‌ఖాన్(20) అనే విద్యార్థి ఈ నెల 2వ తేదీన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణానికి చెందిన ఓ నగల వ్యాపారి కూతురును ప్రేమించినందుకే మోయిన్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మోయిన్ఖాన్ను హత్య చేసేందుకు ఐదుగురు కలిసి కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. అందులో నలుగురు మెదక్ పట్టణానికి చెందిన వారుకాగా ఒకరు ఓల్డ్‌సిటీ యాకుత్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానితులుగా భావించిన మెదక్ పట్టణం అజాంçపురాకు చెందిన మహ్మద్ ఫాజిల్, సయ్యద్ మోజాంబీల్ అహ్మద్, హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ యహియాజాబ్రి అలియాస్ బాండ్లను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను విచారించగా మరో ఇద్దరు మెదక్ పట్టణానికి చెందిన యువకులు సమీర్, షేఖ్ సత్తర్లు హత్యలో పొల్గొన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రియురాలి బావ, సోదరుడు కీలకం.. నగల వ్యాపారి కూతురును మోయిన్ ప్రేమించాడు. డబ్బులు తీసుకొని అమ్మాయిని మరిచిపోవాలని సూచించినా మోయిన్ ప్రేమ డబ్బుకు లొంగలేదు. మరో ఆరు నెలలు అయితే తను ప్రేమించిన అమ్మాయి మేజర్ అవుతుందని అప్పుడు పెళ్లిచేసుకుంటానని మోయిన్ విసిరిన సవాల్ ఆ అమ్మాయి కుటుంబీకులకు మింగుడుపడలేదని, ఫేస్బుక్లో సైతం మోయిన్ చేసిన పోస్టులకు తట్టుకోలేక ఎలాగైనా మోయిన్‌ను హత్య చేయాలని ఆ అమ్మాయి బావ ఫాజిల్, చిన్న అన్న కలిసి మరో ముగ్గురి సహాయం తీసుకున్నారని తెలిపారు. ఓ కేసు విషయంలో ఈ నెల 2న మెదక్ కోర్టుకు çహాజరైన మోయిన్ రాత్రి 8గంటలకు హైదరాబాద్‌కు బస్‌లో బయలుదేరాడు. ఈ విషయం గమనించిన నిందితులు 3320 కారులో జేబీఎస్‌కు వెళ్లి మోయిన్ పై దాడికి పాల్పడి అక్కడే చంపేద్దామనుకున్నారు. కాని ఉన్న ఊర్లో పరువుపోయినందున సొంత ఊర్లోనే చంపాలనుకొని తమ కారులో ఎక్కించుకొని మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో ఉన్న తమ ఫాంహౌస్ వద్ద తీసుకెళ్లారు. అక్కడ మోయిన్ గుండె, వీపు భాగంలో కసిగా కత్తులతో పొడిచి, మర్మాంగాలపై రాళ్లను వేసి, ముఖాన్ని గుర్తుపట్టరాకుండా అతి కిరాతకంగా కొట్టి చంపేసినట్లు వివరించారు. హత్య జరిగిన ప్రదేశంలో మరో పాత ఇండికా కారును ఉంచినట్లు వివరించారు. హత్య చేసేందుకు రెండు కార్లు, కత్తి, చాకు, రెండు బైక్‌లను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయబద్ధంగా విచారణ జరుగుతుందని, బస్ డ్రైవర్, కండక్టర్లతో పాటు మోయిన్ స్నేహితులను సైతం విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ లింబాద్రి, కానిస్టేబుల్ తాహెర్ తదితరులు ఉన్నారు. -
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు
గుంటూరు : పరువు హత్య కేసులో దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబు పోలీసులకు లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను దీప్తి తల్లిదండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరులోని రాజేంద్ర నగర్ లో చోటు చేసుసుకున్న విషయం తెలిసిందే. రిసెప్షన్ ఏర్పాటు చేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించి దీప్తి తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
కన్నకూతుర్ని దారుణంగా చంపిన తల్లిదండ్రులు గుంటూరులో పరువు హత్య ఈనెల 21న ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు రిసెప్షన్ చేస్తామని నమ్మించి తీసుకెళ్లి ఘోరం రాజవొమ్మంగి, పరువుకోసం కన్నకూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రా మానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కొద్దికాలంగా గుంటూరు రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి ఇద్దరు కుమార్తెలు. దీప్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ కుమారుడు కిరణ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మా రింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో వీరి వివాహానికి రెండు కుటుంబాల పెద్దలు మొదట్లో అంగీకరించలేదు. అయితే కుమారుడి కోరిక మేరకు కిరణ్ తల్లిదండ్రులు ఆమోదించినా, దీప్తి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. కంపెనీ పనిలో భాగంగా అమెరికా వెళ్లిన కిరణ్... ఇటీవలే హైదరాబాద్ వచ్చి ఈనెల 21వ తేదీన అక్కడి ఆర్య సమాజంలో దీప్తిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు శనివారం ఇరువురినీ తమ ఇంటికి ఆహ్వానించారు. మంచి ముహూర్తం చూసి రిసెప్షన్ ఏర్పాటుచేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన దీప్తి, కిరణ్, అతడి సోదరులు, మిత్రులతో కలిసి ఆదివారం గుంటూరు చేరుకున్నారు. తీరా కుమార్తెను మాత్రం ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు.. కిరణ్‌ను పిలవలేదు. దీంతో అతను ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఉదయం దీప్తికి కిరణ్ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తన స్నేహితులను దీప్తి కన్నవారింటికి పంపంచాడు. వారు అక్కడకు వెళ్లే సమయానికి దీప్తి తల్లిదండ్రులు కంగారుగా వెళ్లిపోతూ కనిపించారు. అనుమానం వచ్చిన మిత్రులు తలుపులు తీసి చూసేసరికి మెడకు చున్నీ బిగించి, మంచంపై కట్టివేసిన స్థితిలో దీప్తి నిర్జీవంగా పడివుండటాన్ని గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమ డీఎస్పీ టి.వి.నాగరాజు, పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో బిలాలుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కిరణ్‌కుమార్, అతని స్నేహితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీప్తి తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.