కులాంతర వివాహం చేసుకుందని..
కన్నకూతుర్ని దారుణంగా చంపిన తల్లిదండ్రులు గుంటూరులో పరువు హత్య ఈనెల 21న ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు రిసెప్షన్ చేస్తామని నమ్మించి తీసుకెళ్లి ఘోరం
రాజవొమ్మంగి, పరువుకోసం కన్నకూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రా మానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కొద్దికాలంగా గుంటూరు రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి ఇద్దరు కుమార్తెలు. దీప్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.
అదే కంపెనీలో పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ కుమారుడు కిరణ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మా రింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో వీరి వివాహానికి రెండు కుటుంబాల పెద్దలు మొదట్లో అంగీకరించలేదు. అయితే కుమారుడి కోరిక మేరకు కిరణ్ తల్లిదండ్రులు ఆమోదించినా, దీప్తి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. కంపెనీ పనిలో భాగంగా అమెరికా వెళ్లిన కిరణ్... ఇటీవలే హైదరాబాద్ వచ్చి ఈనెల 21వ తేదీన అక్కడి ఆర్య సమాజంలో దీప్తిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు శనివారం ఇరువురినీ తమ ఇంటికి ఆహ్వానించారు. మంచి ముహూర్తం చూసి రిసెప్షన్ ఏర్పాటుచేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన దీప్తి, కిరణ్, అతడి సోదరులు, మిత్రులతో కలిసి ఆదివారం గుంటూరు చేరుకున్నారు.
తీరా కుమార్తెను మాత్రం ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు.. కిరణ్‌ను పిలవలేదు. దీంతో అతను ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఉదయం దీప్తికి కిరణ్ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తన స్నేహితులను దీప్తి కన్నవారింటికి పంపంచాడు. వారు అక్కడకు వెళ్లే సమయానికి దీప్తి తల్లిదండ్రులు కంగారుగా వెళ్లిపోతూ కనిపించారు. అనుమానం వచ్చిన మిత్రులు తలుపులు తీసి చూసేసరికి మెడకు చున్నీ బిగించి, మంచంపై కట్టివేసిన స్థితిలో దీప్తి నిర్జీవంగా పడివుండటాన్ని గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమ డీఎస్పీ టి.వి.నాగరాజు, పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో బిలాలుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కిరణ్‌కుమార్, అతని స్నేహితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీప్తి తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.