సాక్షి, గుంటూరు: ఓ పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్ 2వలైనులో పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి అనే కుమార్తెలున్నారు. దీప్తి హైదరాబాదులోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేది.
అదే కంపెనీలో పశ్చిమ గోదావరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి కిరణ్‌కుమార్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో దీప్తి(26), కిరణ్‌కుమార్ ప్రేమించుకున్నారు. 2014 మార్చి నెల 21వ తేదీ దీప్తి, కిరణ్ హైదరాబాదులోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు 22వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి గుంటూరులో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తామని నమ్మ బలికి, దీప్తిని ఇంటికి తీసుకెళ్లి మంచానికి కట్టేసి చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో హరిబాబు, సామ్రాజ్యం దంపతులకు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment