
‘‘రాయలసీమలో జరిగిన ఒక వాస్తవ పరువు హత్య నేపథ్యంలో ‘బంగారి బాలరాజు’ ఉంటుంది. ఈ మధ్య పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. అయితే.. ప్రేమలో ఉండే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి’’ అని రాఘవ్ అన్నారు. ఆయన హీరోగా, కరోణ్య కత్రిన్ హీరోయిన్‌గా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.
రాఘవ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణవ్ పరువు హత్య అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి హత్యలకు సరైన రీతిలో ముగింపు మా సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. ఇటు ప్రేమికులు.. అటు తల్లిదండ్రుల సమస్యలను చర్చించాం. నిర్మాతల్లో ఒకరైన రెడ్డం రాఘవేంద్రరెడ్డి గారి కొడుకుని నేను. రఫీ, కోటేంద్రగార్ల ప్రోత్సాహం మరచిపోలేనిది’’ అన్నారు.