ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తి
భారత కార్పొరేట్ చరిత్రలో అతి పెద్దది
ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తయింది. వాటాదారులకు డీలిస్టింగ్ ప్రక్రియ కింద రూ.3,745 కోట్లు చెల్లించామని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీలిస్టింగ్. డీలిస్టింగ్ పూర్తవడానికి 9.26 కోట్ల షేర్లు అవసరమని, ఓపెన్ ఆఫర్ ద్వారా 10.1 కోట్ల షేర్లను సమీకరించామని ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ శశి రుయా చెప్పారు. డీలిస్టింగ్లో షేర్లను టెండర్ చేయని వాటాదారులు తమ షేర్లను డీలిస్టింగ్ తేదీ నుంచి ఏడాదిలోపు డీలిస్టింగ్ ధరకు ప్రమోటర్లకు విక్రయించవచ్చని తెలిపారు. డీలిస్టింగ్ విజయవంతం కావడానికి సహకరించిన వాటాదారులకు, స్టాక్ ఎక్స్చేంజీలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. 1995లో ఐపీఓకు వచ్చిన ఎస్సార్ ఆయిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్పుడు రూ.2,000కోట్లుగా ఉంది. డీలిస్టింగ్ ధర(రూ.263)ను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,000 కోట్లకు పెరిగింది.