Dining facilities
-
పోలీస్ సిబ్బందికి నాట్స్ భోజన సదుపాయం
ఇర్వింగ్ : అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం ఇర్వింగ్ పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి చొరవతో స్థానికంగా ఉండే 50 మంది పోలీస్ సిబ్బందికి ఈ మధ్యాహ్నభోజనానికి ఏర్పాట్లు చేసింది. నాట్స్ సభ్యులే స్వయంగా వెళ్లి.. సిద్ధం చేసిన ఆహారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అందించారు. నాట్స్ కాఫీ విత్ కాప్ మరియు నాట్స్ గాంధీ జయంతి వంటి కార్యక్రమాల అనుమతి కోసం గత పదేళ్లుగా స్థానిక పోలీస్ అధికారి జాన్ మిచేల్‌తో బాపు నూతి సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు. ఈ అనుబంధంతో నాట్స్ విందును పోలీస్ అధికారులు అనుమతించడం జరిగింది. పోలీస్ సిబ్బందిని ప్రోత్సాహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని జాన్ మిచేల్ అన్నారు. నాట్స్ టీంను ఆయన ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు రాజేంద్ర మాదల, జ్యోతి వనం, కవిత దొడ్డ, శ్రీనివాస్ పాటిబండ్ల, మిలింద్, యూత్ వాలంటీర్లు వరిశ్, ప్రణవి తదితరులు పాల్గొన్నారు. కరోనా పై పోరాడే ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రోత్సాహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. -
రుయా అంతా మాయ
పని చేయని ఏసీలకు మరమ్మతులు మంచాల కొనుగోలులో గోల్మాల్ సాక్షి, తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భోజన సదుపాయాల నుంచి స్ట్రెచర్లు, మంచాలు, అధునాతన వైద్యపరికరాల కొనుగోళ్ల వరకు అన్నీ అక్రమాలే. ఆస్పత్రి ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్ బాడుగల సొమ్ము కూడా రుయా అధికారుల సొంత ఖాతాలకు వెళుతోంది. పనిచేయని ఏసీలకు మరమ్మతుల పేరుతో లక్షలరూపాయలు స్వాహా చేస్తున్నారు. మంచాల కొనుగోళ్లలో అక్రమాలు.. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను రోగులకు అవసరమైన కొత్త మంచాల కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. నాణ్యతలేని మంచాలు కొనుగోలు చేయడంతో కొద్ది రోజులకే విరిగిపోతున్నాయి. ఈ వార్షిక సంవత్సరంలో రెండు నెలల వ్యవధిలో రెండు విడతలుగా 200 మంచాలు కొనుగోలు చేశారు. ముందు ఒక్కో మంచం రూ.8,500లకు కొనుగోలు చేయగా రెండోసారి అవే రకం మంచాలను రూ.10,500లకు కొనుగోలు చేశారు. రెండు నెలల గడువులో ఒక్కో మంచానికి రెండు వేల రూపాయలు అదనంగా ఎందుకు చెల్లించారనేది ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు రెండోసారి కొనుగోలు చేసిన మంచాల రేకు గేజ్ తక్కువగా ఉండటంతో రోగులు పడుకుంటే అవి వంగిపోతున్నాయి. దీంతో వీటిని ఆరోగ్యశ్రీ వార్డుపైన ఉన్న ఒక గదిలో నిల్వ చేశారు. మంచాల నాణ్యతపై ఒక ప్రొఫెసర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వాటిపై ఎలాంటి విచారణ జరగకుండా కొందరు తొక్కిపెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. షాపుల లీజు సొమ్ము స్వాహా రుయా ఆస్పత్రి ప్రాంగణంలో 17 షాపులు ఉన్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఒక్కో షాపునకు రెండు వేల రూపాయలు లీజుగా నిర్ణయించారు. ఈ మొత్తం స్వాహా అవుతున్నట్టు తెలిసింది. వీటికి సంబంధించిన రికార్డులు కూడా లేవని సమాచారం. లీజు రూపంలో కాకుండా కరెంటు బిల్లు కోసం అన్నట్టుగా యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేయడంలోనే గూడుపుఠాణి ఉంది. ఆస్పత్రి కరెంటు బిల్లును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులోనే షాపులకు వినియోగిస్తున్న బిల్లు కూడా జమ అవుతుంది. దీని దృష్ట్యా ప్రత్యేకంగా షాపులకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో షాపుల యజమానుల నుంచి బాడుగ రూపంలో కాకుండా కరెంట్ బిల్లుల పేరుతో వసూలు చేసిన మొత్తం అనధికారిక ఖాతాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బాడుగుల రూపంలో వచ్చే మొత్తం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయం మేరకు వినియోగించాల్సి ఉంది. అయితే ప్రతి నెలా వసూలయ్యే ఈ మొత్తాలు ఏమవుతున్నాయనే విషయంపై ఆస్పత్రి వర్గాలు పెదవి విప్పడం లేదు. ఏసీల మరమ్మతుల పేరుతో... రుయా ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 36 ఎయిర్‌కండిషనర్లు ఉన్నాయి. వీటిలో 25కు పైగా ఏసీలు పనిచేయడం లేదు. అయితే ఈ ఏడాదిలో వీటి మరమ్మతులకు రెండున్నర లక్షల రూపాయలు బిల్లులు చేసుకోవడం ఇక్కడి అవినీతికి అద్దం పడుతోంది. పనిచేయని వెంటిలేటర్లు రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణవాయువును అందించే ఖరీదైన వెంటిలేటర్లు పనిచేయడం లేదు. మొత్తం 18 వెంటిలేటర్లు ఉండగా అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకటి ఎయిడ్స్ పేషంట్లకు వినియోగిస్తుండగా మిగిలింది ఒక్కటే. ఈ ఒక్క వెంటిలేటర్‌తో పెద్ద సంఖ్యలో వచ్చే రోగుల ప్రాణాలకు హామీ ఉండదనేది స్పష్టమవుతోంది. మరమ్మతులకు గురైన వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపయోగంగా ఆటో అనలైజర్ సుమారు రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన ఆటో అనలైజర్ పరికరం నిరుపయోగంగా ఉంది. ఒకేసారి 200 మందికి సంబంధించిన వివిధ రకాల రక్తపరీక్షలు చేసేందుకు ఈ పరికరం కొనుగోలు చేశారు. దీనిద్వారా రక్తంలోని చక్కెర శాతం, క్రియాటిన్, యూరియా వంటి పరీక్షలను తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ పరికరంలో ఒక ఎలక్ట్రిక్ బోర్డు లేదని ఆస్పపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ పరికరం ఎందుకూ కొరగాకుండా పోయింది. అసలు ఇటువంటి పరికరం ఒకటుందనే విషయం కూడా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. నాణ్యత లేని ఆహారం పంపిణీ రోగులకు పంపిణీ చేసే ఆహారం నాణ్యత ఉండటం లేదు. తక్కువ రకం బియ్యంతో తయారు చేస్తున్న భోజనం ముద్దలు ముద్దలుగా ఉంటోంది. ఈ భోజనం కూడా నిర్ణీత సమయానికి అందించడం లేదు. దీంతో రోగుల బంధువులు బయట నుంచి ఆహారపదార్థాలు తెచ్చిపెడుతున్నారు. ఆస్పత్రిలో ఒక్కో రోగికి ఒకపూట ఆహారానికి గాను రూ.40 ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 700 మందికి పైగా ఈ సదుపాయం పొందుతున్నారు. ఆహారం పంపిణీ ఆస్పత్రి అధికారులకు కామధేనువుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. వివిధ రకాల జబ్బులున్న రోగులకు వేర్వేరు మెనూ ఉంది. కాని దీనిని అమలు చేయడం లేదు. అందరికీ ఒకేరకమైన ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదు మంచాల్లో కొన్ని లోపాలు ఉన్నది వాస్తవమే. వాటిలో కొన్ని విరిగిపోయాయి. వేలూరుకు చెందిన ఒక కంపెనీ వీటిని ఇచ్చింది. విరిగిపోయిన వాటి స్థానంలో రీప్లేస్ చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఒక రకమైన సొల్యూషన్ లేకపోవడంతో ఇన్ని రోజులు అనలైజర్‌ను ఉపయోగించలేదు. ప్రస్తుతం ఆ సొల్యూషన్ తెప్పించాం. ఇక అనలైజర్ అందుబాటులోకి తెస్తాం. ఇక ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. - వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి -
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: విధులు, పంచాయతీలకు కేటాయించే నిధులు, నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలోని సర్పంచులకు గురువారం నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 13 నియోజకవర్గాల్లోని సర్పంచులకు మూడు విడతలలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకుగానూ జిల్లా నుంచి 16 మంది ప్రత్యేక మాస్టర్ ట్రేడర్స్ అధికారులను హైదరాబాద్‌కు శిక్షణ నిమిత్తం పంపించారు. అపార్డ్ ద్వారా అందించే మెటీరి యల్‌తోపాటు, షార్ట్‌ఫిల్మ్, వ్యక్తిత్వ వికాసంపై పట్టాభిరామ్‌తో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. శిక్షణ సమయంలో వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. జ్యోతిష్మతికి వెళ్లేందుకు జిల్లా పరిషత్ నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఛైర్మన్‌గా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, కన్వీనర్‌గా జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, కోకన్వీనర్‌గా డీపీవో కుమారస్వామి వ్యవహరించనున్నారు. తొలి విడత.. ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించే తొలి విడతలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల సర్పంచులకు హుజూరాబాద్‌లోని కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణనివ్వనున్నారు. రెండో విడత.. ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల వారికి హుజూరాబాద్ కిట్స్‌లో, మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వారికి జ్యోతిష్మతిలో ఏర్పాటు చేశారు. మూడో విడత.. ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించే మూడో విడతలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల వారికి జ్యోతిష్మతిలో నిర్వహించనున్నారు. జ్యోతిష్మతిలో.. తిమ్మాపూర్ : ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను జిల్లాలోని సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు కోరారు. తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల, హుజూరాబాద్ కిట్స్ కళాశాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిపుణుడు పట్టాభిరాం, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లలితాదేవి తదితరులు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.