జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: విధులు, పంచాయతీలకు కేటాయించే నిధులు, నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలోని సర్పంచులకు గురువారం నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 13 నియోజకవర్గాల్లోని సర్పంచులకు మూడు విడతలలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకుగానూ జిల్లా నుంచి 16 మంది ప్రత్యేక మాస్టర్ ట్రేడర్స్ అధికారులను హైదరాబాద్‌కు శిక్షణ నిమిత్తం పంపించారు. అపార్డ్ ద్వారా అందించే మెటీరి యల్‌తోపాటు, షార్ట్‌ఫిల్మ్, వ్యక్తిత్వ వికాసంపై పట్టాభిరామ్‌తో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. శిక్షణ సమయంలో వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. జ్యోతిష్మతికి వెళ్లేందుకు జిల్లా పరిషత్ నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఛైర్మన్‌గా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, కన్వీనర్‌గా జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, కోకన్వీనర్‌గా డీపీవో కుమారస్వామి వ్యవహరించనున్నారు.
తొలి విడత..
ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించే తొలి విడతలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల సర్పంచులకు హుజూరాబాద్‌లోని కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణనివ్వనున్నారు.
రెండో విడత..
ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల వారికి హుజూరాబాద్ కిట్స్‌లో, మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వారికి జ్యోతిష్మతిలో ఏర్పాటు చేశారు.
మూడో విడత..
ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించే మూడో విడతలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల వారికి జ్యోతిష్మతిలో నిర్వహించనున్నారు.
జ్యోతిష్మతిలో..
తిమ్మాపూర్ : ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను జిల్లాలోని సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు కోరారు. తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల, హుజూరాబాద్ కిట్స్ కళాశాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిపుణుడు పట్టాభిరాం, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లలితాదేవి తదితరులు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.