Dinner Set
-
ఆభరణాల డిన్నర్ సెట్
కంఠహారం, చెవి జూకాలు, ఉంగరాలు.. ఇలా ఆభరణాలను ఒక సెట్‌గా తీసుకోవడం మనకు తెలిసిందే! ఇప్పుడు డిన్నర్ సెట్ ఆభరణాల అలంకరణ కొత్త ట్రెండ్‌గా మారింది. డిన్నర్‌సెట్ ఆభరణాలు ఇంటికి మరింత కళను తీసుకువస్తున్నాయి. పింగాణీ కప్పులు, ప్లేట్ల మీద ఇంపైన ఆభరణాల డిజైన్లు భలే మెరుస్తున్నాయి. డిజైన్‌ను బట్టి, వాటికి వాడిన రంగుల నాణ్యతను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. వీటిలో పూసలు, ముత్యాలు, స్టోన్స్, ఎనామిల్ పెయింట్స్‌ను కూడా వాడుతున్నారు. ఈ డిజైన్లలో బంగారు పూత, నిజమైన రత్నాలు వాడినవీ ఉంటున్నాయి. ప్లెయిన్‌గా ఉండే పింగాణీ కప్పుల మీద అందమైన ఆభరణాల డిజైన్లను తీర్చిదిద్దేతే అవి కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ప్లెయిన్ పింగాణీ వస్తువులను కొనుక్కుని, వాటిపై స్వయంగా రంగులు వేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్‌నూ దిద్దుకోవచ్చు. అతిథులను ఆకట్టుకునేలా వీటిని వేడుకలలో ఉపయోగిం చవచ్చు. -
పాములే ఫలహారం
పాట్నా: పాములను వెతికి పట్టుకుని మరీ పరపర నమిలి భోంచేసే ఇతగాడి పేరు నిరంజన్ భాస్కర్. బీహార్‌లోని అరాహ్ జిల్లా వాసి. వృత్తి పెయింటింగ్. ‘పాము నెత్తురు అప్పుడే పితికిన పాల రుచితో ఉంటుంది... పాము లేకుండా నా భోజనం పూర్తి కాదు’ అని చెబుతాడు ఇతడు. రోజూ ఉదయాన్నే గంగానది ఒడ్డుకు వెళ్లి, పుట్టల్లోను, కలుగుల్లోను, రాళ్ల సందుల్లోను నక్కిన పాములను వేటాడటం ఇతడి దినచర్య. ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే తొలిసారిగా పచ్చి పాము మాంసాన్ని రుచి చూసినట్లు నిరంజన్ చెప్పాడు. ‘అది 1977 వర్షాకాలం. వర్షంలో నేను బడికి వెళుతుండగా ఒక పాము నాపై దాడిచేసింది. తప్పించుకునే మార్గం లేకపోవడంతో నాకు కోపం తారస్థాయికి చేరుకుంది. ఆ పాముని పట్టుకుని కసితీరా కొరికేశాను. అలా కొరుకుతూ కొరుకుతూ మొత్తం తినేశాను’ అని ఆనాటి జ్ఞాపకాన్ని వివరించాడు. అప్పటి నుంచి ఏదోలా రోజుకు ఒక పామునైనా వెతికి పట్టుకుని తినడం అలవాటుగా వస్తోందని చెప్పాడు. ఇప్పటి వరకు నాలుగువేలకు పైగా పాములను తినేశానని, తన ఘనతను గిన్నిస్‌బుక్ గుర్తించాలని అంటున్నాడు.