diputation
-
పోస్టు అక్కడ.. విధులు ఇక్కడ
ఆదిలాబాద్‌టౌన్ : విద్యాశాఖలో అధికారుల తీరు మారడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వారికి నచ్చినట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బోధన కోసం నియామకమైన ఉపాధ్యాయులు ఇతర పనుల్లో ఉండరాదని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది. వారు కేవలం వేతనం తీసుకుంటున్న పాఠశాలలోనే బోధన చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్ద పీఏలుగా ఉన్న వారు, ఇతరత్రా డెప్యూటేషన్లపై పని చేసిన వారిని గతేడాది తొలగించిన విషయం తెలిసిందే. అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్వీఎం సెక్టోరియల్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. వేతనం స్కూల్లో పొందుతూ డీఈవో కార్యాలయంలో ఈమె విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం డిప్యూటేషన్‌పై ఉండరాదు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు అక్రమ డెప్యూటేషన్లపై ఉండడంతో విద్యార్థులకు తీరని నష్టం కలుగుతోంది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఒకే పోస్టులో ఇద్దరు అధికారులు.. ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి పోస్టు ఫారన్ సర్వీస్‌లో ఉంటుంది. ఈ పోస్టుకు ఉపాధ్యాయులు పరీక్షరాసి ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే సెక్టోరియల్–3 అధికారి కేజీబీవీలను పరిశీలించేందుకు ఎస్పీడీ ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇవ్వకుండానే వారికి నచ్చిన వారికి ఆ పోస్టును అప్పజెప్పారనే ఆరోపణలున్నాయి. కాగా, జిల్లాలో వారం క్రితం వరకు ఇద్దరు సెక్టోరియల్ అధికారులు పని చేశారు. మూడో సెక్టోరియల్ అధికారిగా ఓ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై నియమించారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు కంది శ్రీనివాస్ సెక్టోరియల్ అధికారి–3గా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు సెక్టోరియల్ అధికారి–3 బాధ్యతలు నిర్వహిస్తున్న టీచర్‌ను రిలీవ్ చేసి పాఠశాలకు పంపించాల్సి ఉండగా ఒకే పోస్టులో ప్రస్తుతం ఇద్దరూ కొనసాగుతుండడం గమనార్హం. కలెక్టర్ అనుమతితో నియమించాం.. కలెక్టర్ దివ్యదేవరాజన్ అనుమతితో సెక్టోరియల్ అధికారి–3ని నియమించాం. కేజీబీవీలను పరిశీలించేందుకు మహిళా ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులు పని చేయవద్దనే ఆదేశాలు ఉన్నవి వాస్తవమే. సెక్టోరియల్ అధికారి–3 ఇటీవల బదిలీపై వచ్చారు. ఈ విషయంలో ఆలోచిస్తాం. జనార్దన్‌రావు, డీఈవో, ఆదిలాబాద్. -
పోలీస్ ‘రీ-కాల్’ వివాదం కొలిక్కి
పది ప్లటూన్లు తిప్పి పంపడానికి తెలంగాణ అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్, బందోబస్తు విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని వెనక్కి పంపడంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. ప్రాథమికంగా పది ప్లటూన్లు (దాదాపు 200 మంది) పంపేందుకు తెలంగాణ డీజీపీ అంగీకరించారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో వీరు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి రిపోర్ట్ చేయనున్నారు. తెలంగాణకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లతో పాటు స్పెషల్ పోలీసు బెటాలియన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నారు. వీరిని ఏపీకి తీసుకువెళ్లాలంటే కమలనాథన్ కమిటీ పంపకాలు పూర్తి కావాల్సిందే. అయితే బందోబస్తుతో పాటు ఇతర ప్రత్యేక విధుల కోసం రాష్ట్ర విభజన తరువాత డిప్యుటేషన్‌తో పాటు ఇతర విధానాల్లో తెలంగాణకు వచ్చిన ఏపీ అధికారులు వందల సంఖ్యలో ఉన్నారు. గోదావరి పుష్కరాలతో పాటు ఇతర బందోబస్తు, భద్రతా అవసరాల దృష్ట్యా వీరిని వెనక్కి పిలవాలని ఏపీ పోలీసు విభాగం నిర్ణయించింది. వారు రిపోర్ట్ చేయడానికి వీలుగా రిలీవ్ చేయాలని తెలంగాణ డీజీపీని కోరగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యంకాదంటూ అక్కడి నుంచి తొలుత సమాధానం వచ్చింది. చివరకు విషయం గవర్నర్ వద్దకు చేరడం, గడిచిన ఐదారు రోజులుగా రెండు రాష్ట్రాలకూ చెందిన ఉన్నతాధికారుల సమాలోచనలతో ఈ వివాదం కొలిక్కివచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీకి చెందిన 42 ప్లటూన్లలో 10 ప్లటూన్లను తక్షణం వెనక్కి పంపడానికి అంగీకారం కుదిరింది. రంజాన్ పండుగ, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం బందోబస్తుల అనంతరం విడతల వారీగా మిగిలిన వారినీ పంపుతామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చింది.