పోలీస్ ‘రీ-కాల్’ వివాదం కొలిక్కి
పది ప్లటూన్లు తిప్పి పంపడానికి తెలంగాణ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్, బందోబస్తు విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని వెనక్కి పంపడంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. ప్రాథమికంగా పది ప్లటూన్లు (దాదాపు 200 మంది) పంపేందుకు తెలంగాణ డీజీపీ అంగీకరించారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో వీరు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి రిపోర్ట్ చేయనున్నారు. తెలంగాణకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లతో పాటు స్పెషల్ పోలీసు బెటాలియన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నారు.
వీరిని ఏపీకి తీసుకువెళ్లాలంటే కమలనాథన్ కమిటీ పంపకాలు పూర్తి కావాల్సిందే. అయితే బందోబస్తుతో పాటు ఇతర ప్రత్యేక విధుల కోసం రాష్ట్ర విభజన తరువాత డిప్యుటేషన్‌తో పాటు ఇతర విధానాల్లో తెలంగాణకు వచ్చిన ఏపీ అధికారులు వందల సంఖ్యలో ఉన్నారు. గోదావరి పుష్కరాలతో పాటు ఇతర బందోబస్తు, భద్రతా అవసరాల దృష్ట్యా వీరిని వెనక్కి పిలవాలని ఏపీ పోలీసు విభాగం నిర్ణయించింది. వారు రిపోర్ట్ చేయడానికి వీలుగా రిలీవ్ చేయాలని తెలంగాణ డీజీపీని కోరగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యంకాదంటూ అక్కడి నుంచి తొలుత సమాధానం వచ్చింది.
చివరకు విషయం గవర్నర్ వద్దకు చేరడం, గడిచిన ఐదారు రోజులుగా రెండు రాష్ట్రాలకూ చెందిన ఉన్నతాధికారుల సమాలోచనలతో ఈ వివాదం కొలిక్కివచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీకి చెందిన 42 ప్లటూన్లలో 10 ప్లటూన్లను తక్షణం వెనక్కి పంపడానికి అంగీకారం కుదిరింది. రంజాన్ పండుగ, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం బందోబస్తుల అనంతరం విడతల వారీగా మిగిలిన వారినీ పంపుతామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చింది.